Rahul Gandhi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పైన, బీజేపీ (BJP) మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలోని ఓ సంస్థ భారతదేశ భవిష్యత్తును, దేశంలో విద్యావ్యవస్థను ఖతం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆ సంస్థ మరేదో కాదని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అని ఆయన చెప్పారు.
ఒకవేళ భారత విద్యావ్యవస్థ క్రమంగా ఆరెస్సెస్ చేతుల్లోకి వెళ్తే దేశం పూర్తిగా నాశనమవుతుందని రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో ఎవరికీ ఉద్యోగాలు రావని, దేశం పని ఖతమవుతుందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో NSUI నిరసన కార్యక్రమంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. అన్ని విద్యార్థి సంఘాలు కార్యక్రమానికి వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. దేశంలో ఏం జరుగుతుందో విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత విద్యార్థి సంఘాలపైనే ఉందన్నారు.
దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సెలర్స్లో ఆరెస్సెస్ ఆధిపత్యం ఉన్నదని రాహుల్‌గాంధీ చెప్పారు. ఇక ముందు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకు వీసీలను కూడా ఆర్ఎస్ఎస్ నామినేట్ చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని, అలా జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ప్రధాన సమస్యగా ఉన్నదని రాహుల్‌గాంధీ అన్నారు.
కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ పార్లమెంటులో కుంభమేళా గురించి మాట్లాడారని, తాను ఆయనకు ఒక విషయం చెప్పదల్చుకున్నానని రాహల్‌గాంధీ అన్నారు. కుంభమేళా గురించి మాట్లాడటం మంచి విషయమేగానీ, ఆయన దేశ భవిష్యత్తు గురించి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశంలోని యువతను మోదీ ప్రభుత్వం నిరుద్యోగులుగా మార్చిందని, కాబట్టి ప్రధాని మోదీ ఆ సమస్యపై కూడా మాట్లాడాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.