Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతున్నది. వరుసగా ఆరో రోజు మార్కెట్లు లాభాల ర్యాలీ కొనసాగింది. ఫైనాన్సియల్, బ్యాంకింగ్ రంగాల్లో స్టాక్స్ పెరుగుల కారణంగా సూచీలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ సానుకూల పవనాలకు తోడు.. విదేశీ పెట్టుబడులు కొనసాగుతుండడంతో పాటు బ్లూ-చిప్ స్టాక్స్ కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. సోమవారం ఉదయం 77,456.27 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సెన్సెక్స్ చివరి వరకు అదే జోష్‌లో కొనసాగాయి. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో 77,179.35 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 78,107.23 పాయింట్లకు పెరిగింది. చివరకు 1,078.87 పాయింట్లు పెరిగి.. 77,984.38 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 307.95 పాయింట్లు పెరిగి 23,658.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,371 షేర్లు లాభపడ్డాయి. 1,602 షేర్లు నష్టపోగా.. మరో 153 షేర్లు మారలేదు. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఆయిల్, గ్యాస్, పవర్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ తదితర రంగాలకు చెందిన సూచీలు ఒకటి నుంచి మూడుశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతానికిపైగా వృద్ధిని నమోదు చేశాయి. నిఫ్టీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్ప్, టెక్ మహీంద్ర భారీగా లాభపడ్డాయి. అయితే ఎంఅండ్ఎం, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, భారతి ఎయిర్టెల్ నష్టపోయాయి.