Koppula Eshwar | హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను మరోసారి నిరాశపరిచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 9వ సారి ప్రవేశపెట్టిన జాతీయ బడ్జెట్ 2026-27 తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి నిరాశపరిచిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 54.1 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఫలితంగా బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కొప్పుల ఈశ్వర్ . 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా బడ్జెట్లో రాష్ట్రానికి గుండుసున్నా మిగిలింది. రాష్ర్టానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు ఏం సమాధానం చెబుతారు. ఆర్థిక మంత్రికి తెలంగాణ కనిపించలేదా…? 62 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర బడ్జెట్లో నిధులు సాధించడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగింది. నాడు పదహారు మంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రం నుంచి రూ.వేల కోట్ల నిధులు సాధించారని,కానీ ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీ నుంచి 8 మంది, రాష్ట్రంలోని అధికార పార్టీ నుంచి 8 మంది చొప్పున ఎంపీలున్నా 2026-27 కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు సాధించడంలో విఫలమయ్యారని కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచేయి..
రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 ఏండ్లు దాటినా విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేరకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండిచేయి చూపింది. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది.తెలంగాణలో 12 శాఖలకు సంబంధించిన 47 ప్రాజెక్టులకు బడ్జెట్లో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల పర్యావరణ వ్యవస్థలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్కు సెమీ కండక్టర్ ప్రాజెక్టు మంజూరు చేయాలని పదే పదే కోరినా కేంద్రం కనికరించలేదని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం), నవోదయ, సెంట్రల్ స్కూల్స్ ఏర్పాటు ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదన్నారు. రైతుల సంక్షేమం, ఉద్యోగాల కల్పన గురించి ఎటువంటి హామీలు కూడా బడ్జెట్లో పేర్కొనకపోవడం బాధాకరమన్నారు.