Bandla Ganesh | శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ విడుదలకు సిద్ధమవుతోంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్లకు కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో ఫిబ్రవరి 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా సినిమాలోని ప్రత్యేక గీతం ‘పాయా పాయా’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన స్టెప్పులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఫుడ్ ఫెస్టివల్ నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ను కలర్‌ఫుల్ థీమ్‌తో తెరకెక్కించగా, బండ్ల గణేష్ విభిన్న దుస్తుల్లో మెరిసిపోతూ ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేశారు. ఆయనతో పాటు కమెడియన్ అలీ, బబ్లూ, భోలే శావలి కూడా ఈ పాటలో కనిపిస్తూ వినోదాన్ని పంచారు. ముఖ్యంగా అలీ డీజే ఆపరేటర్ పాత్రలో కనిపించడం పాటకు అదనపు హైలైట్‌గా మారింది. ఈ సాంగ్‌కు భోలే శావలి స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించడం విశేషం కాగా, జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానం గురించి అందరికీ తెలిసిందే. తాను అభిమానికాదు, భక్తుడిని అని అనేక వేదికలపై ప్రకటించిన ఆయన “ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా” అంటూ గతంలో చెప్పిన డైలాగ్ ఎంతో వైరల్ అయింది. ఇప్పుడు అదే డైలాగ్‌ను ఈ ‘పాయా పాయా’ పాటలో రీమిక్స్ చేసి వినిపించడంతో పాటు పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని అనుకరిస్తూ స్టెప్పులు వేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
అంతేకాదు “పవన్ కళ్యాణ్ అన్న కూడా హైదరాబాద్ సే పాయా మంగాయా… ఎప్పుడైతే పవన్ అన్న తిన్నడో హైదరాబాద్ కా పాయా… హిట్ల మీద హిట్లతో పవర్ స్టార్ బన్ గయా” అంటూ చేసిన లిరిక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. శివాజీ ఈ పాటలోని “ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా” వీడియో క్లిప్‌ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ బండ్ల గణేష్‌కు పవన్‌పై ఉన్న ప్రేమ స్వచ్ఛమైనదని, సాటిలేనిదని వ్యాఖ్యానించారు. పాటలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా అభిమానాన్ని వ్యక్తపరుస్తూ బండ్ల గణేష్ చేసిన స్టెప్పులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పాట ట్యూన్ వినడానికి, పాడుకోవడానికి అంత గొప్పగా లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం బండ్ల గణేష్ ఎనర్జీని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ‘పాయా పాయా’ పాట ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాకు ఎంత మేరకు హైప్ తీసుకువస్తుందో, ఓటీటీ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
Eeshawara Pawaneshwara Powereshwara 🤩@ganeshbandla ’s love for @PawanKalyan is PURE & UNMATCHED 💥🔥🕺🎊#PayaPayaSong Out Now
🔗: https://t.co/QjVcn7SLJA#SSS #Sampradayinisuppinisuddapoosani on Feb 12!
A @etvwin original Production pic.twitter.com/pM3GGQQsjZ
— Sivaji (@ActorSivaji) February 1, 2026