Shambala | ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘శంబాల’ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకోవడమే కాకుండా ఓటీటీ వేదికపైన కూడా తన సత్తా చాటుతోంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ అనంతరం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటూ రికార్డు స్థాయి వ్యూస్‌ను నమోదు చేస్తోంది. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించడం విశేషంగా మారింది. దీంతో చాలా కాలం తర్వాత ఆది సాయికుమార్‌కు ఒక పక్కా కమర్షియల్ హిట్ దక్కిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
సస్పెన్స్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ చిత్రంలో కథనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి సన్నివేశం ఆసక్తిని పెంచేలా తెరకెక్కించడం, అనూహ్య ట్విస్టులు, థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్ అన్ని కలిసి ప్రేక్షకులను స్క్రీన్కు కట్టిపడేసేలా చేశాయి. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులు మిస్టరీ థ్రిల్లర్లకు చూపించే ఆసక్తి ‘శంబాల’ విజయానికి మరింత బలం చేకూర్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్ కీలక పాత్ర పోషించగా, శ్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, లక్ష్మణ్ మీసాల వంటి నటులు తమ పాత్రలతో కథకు బలం చేకూర్చారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్‌గా నిలిచింది. థ్రిల్లింగ్ మూడ్‌ను ఎలివేట్ చేసే సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు రావడం కూడా ఓటీటీ రన్‌కు తోడ్పడింది.
ఇదిలా ఉంటే ‘శంబాల’ హిందీ వెర్షన్ విడుదలకు కూడా రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ చిత్రం హిందీలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రానుందని సమాచారం. హిందీ వెర్షన్ విడుదలైన తర్వాత ఈ సినిమాకు మరింత విస్తృతమైన ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు వర్షన్‌తోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసిన ఈ చిత్రం, హిందీ రిలీజ్ అనంతరం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ‘శంబాల’ఓటీటీ వేదికపై ఆది సాయికుమార్ కెరీర్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు.