Suryakumar Yadav : ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహాలతో సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే కొత్త కెప్టెన్లను నియమిస్తున్నాయి. అయితే.. అన్నింటికంటే ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతోంది. రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ(Rohit Sharma)ను కాదని హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు బాధ్యతలు అప్పగించడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
రోహిత్ తర్వాత ముంబై ఇండియన్స్ సారథి రేసులో ఉన్న సీనియర్లకు కూడా ఇది రుచించడం లేదు. తాజాగా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్‌బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ‘పాండ్యాకు సారథ్యం అప్పగించడమే కారణమా?’, ‘సూర్య ముంబై కెప్టెన్సీ ఆశించాడా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
💔
— Surya Kumar Yadav (@surya_14kumar) December 16, 2023
ముంబై ఫ్రాంచైజీ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) నుంచి హార్దిక్‌ను తిరిగి దక్కించుకుంది. దాంతో అప్పటి నుంచి రోహిత్ వారసుడు పాండ్యానే అనే వార్తలు వినిపించాయి. దాంతో, ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah) ‘సైలెన్స్’ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్లో సూపర్ ఇన్నింగ్స్‌లతో భారత జట్టులోకి వచ్చిన కొందరిలో సూర్య ఒకడు. ఐపీఎల్ సీజన్ కొత్తలో ముంబైకి ఆడిన సూర్యను 2014లో కొల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) సొంతం చేసుకుంది. అయితే.. ఈస్టార్ ప్లేయర్‌ను ముంబై తిరిగి 2018లో కొనుగోలు చేసింది.
అప్పటి నుంచి ఈ విధ్వంసక ఆటగాడు మెరుపు బ్యాటింగ్‌తో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో సెలెక్టర్ల దృష్టిలో పడిన సూర్య.. టీ20 స్పెషలిస్ట్‌గా ఎదిగాడు. అంతేకాదు పొట్టి ఫార్మాట్‌కు సారథిగా ఎంపికైన సూర్య.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలో తనను తాను నిరూపించుకున్నాడు. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో సూర్య శతకంతో విరుచుకుపడ్డాడు. దాంతో, పొట్టి ఫార్మాట్లో నాలుగో సెంచరీతో రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డు సమం చేశాడు.