IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 25కుపైగా స్కోర్లు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఈ మిస్టర్ 360 రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో మ్యాచ్‌లో ఈ రికార్డుకు చేరవయ్యాడు.
డెత్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగిన సూర్య 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన .. 11వసారి ఈ 25కు పైగా స్కోర్ నమోదు చేశాడు. దాంతో, ఐపీఎల్లో ఈ మైలురాయికి చేరువైన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడీ హిట్టర్. ఈ ముంబై చిచ్చరపిడుగు ధాటికి రాబిన్ ఊతప్ప రికార్డు బద్దలైంది.
काम पच्चीस+ है 😎
Surya Dada bole toh game over! 🔥#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI pic.twitter.com/yHfR0ytyeT
— Mumbai Indians (@mipaltan) May 2, 2025
ఒకప్పుడు ఐపీఎల్ స్టార్‌గా పేరొందిన రాబిన్ ఊతప్ప 2014లో సుడిగాలిలా చెలరేగాడు. ఆ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఊతప్ప తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుసగా 10 మ్యాచుల్లో 25కు పైగా స్కోర్లతో రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత 10 సీజన్లు జరిగినా ఎవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు.
అయితే.. 18వ ఎడిషన్‌లో నిలకడగా రాణిస్తున్న సూర్య.. తనవైన స్కూప్ షాట్లతో విరుచుకుపడుతూ వరుసగా 11 సార్లు 25కు పైగా పరుగులు బాదాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై 29 పరుగులు చేసిన సూర్య.. ఆ తర్వాత జరిగిన పది మ్యాచుల్లో దంచి కొట్టాడు. గుజరాత్‌పై 48, కోల్‌కతాపై 27 నాటౌట్, లక్నోపై 67, ఆర్సీబీపై 28, ఢిల్లీపై 40, హైదరాబాద్‌పై 26,సీఎస్కేపై 68 నాటౌట్, హైదరాబాద్‌పై 40 నాటౌట్, లక్నోపై 54, రాజస్థాన్‌పై 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
All-round performance tonight 💪🔥#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI https://t.co/AmhPCixVwb
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
సూర్య మెరుపులతో నెల క్రితం 7వ స్థానంలో ఉన్న ముంబై డబుల్ హ్యాట్రిక్ విక్టరీలతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికారేస్తూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సూర్య.. ఇప్పటివరకూ 150 మ్యాచ్‌లు ఆడాడు. 145.32 స్ట్రయిక్ రేటుతో వీరవిహారం చేసిన అతడు 3,594 రన్స్ సాధించాడు. అతడి ఖాతాలో 24 అర్ధ శతకాలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 103.