కొత్తగూడెం అర్బన్, మే 02 : కొత్తగూడెం మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాతను కలిసి విన్నవించారు. వివిధ వార్డుల్లో మంజూరైన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెంటనే చేపట్టాలని, వార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వీధి కుక్కలు, కోతుల బెడదను తగ్గించాలని, పారిశుధ్య కార్మికులు, ట్రాలీ డ్రైవర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ”మహిళా శక్తి” క్యాంటీన్ లకు రుణాలు మంజూరు చేయాలన్నారు. రాజీవ్ పార్కులో లైటింగ్ వ్యవస్థను మరమ్మతు చేయాలని, ఓపెన్ జిమ్, త్రాగునీరు, టాయిలెట్స్ సౌకర్యాలను కల్పించాలని, సింగరేణి ప్రధాన ఆస్పత్రి వద్ద నిర్మించిన ఫౌంటేన్ ఔట్ లెట్ పనులు, వివిధ వార్డుల్లో డ్రైనేజీ, రోడ్డు, కల్వర్టు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
అలాగే మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని బోర్లు వేయించి, మినీ వాటర్ ట్యాంకులకు రిపేర్లు చేయించి నీటి కొరత తీర్చాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీపాస్ పద్దతిలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే 1985లో చెల్లించిన ఇంటి పన్నుల బిల్లు తేవాలని అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, లేకుంటే ఎల్ఆర్ఎస్ చెల్లించాలని ఆదేశిస్తున్నారని, తద్వారా ఇంటి యజమాని అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
16వ వార్డులో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో నెలకొన్న సమస్యలను తీర్చాలని, వైకుంఠ ధామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని తదితర సమస్యలను మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ ఆధ్వర్యంలో కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కమిషనర్ త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, మాజీ కౌన్సిలర్లు రుక్మాంగధర్ బండారి, వేముల ప్రసాద్ బాబు, అంబుల వేణుగోపాల్, పల్లపు రాజు, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
అనంతరం కొత్తగూడెం మండల తాసీల్దార్ దొడ్డి పుల్లయ్యను కలిసి సమస్యలను ప్రస్తావించారు. పట్టణంలో క్రమబద్ధీకరణ కోసం జీఓ నంబర్ 76 దరఖాస్తు చేసుకున్న ఇండ్లకు సర్వే పూర్తి చేశారని, ఇప్పటి వరకు పట్టాలివ్వకుండా నిలిపివేశారని, వెంటనే పట్టా పంపిణీ ప్రక్రియ చేపట్టాలను కోరారు. రేషన్ కార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఆయన బీఆర్ఎస్ నాయకులకు హామీ ఇచ్చారు.