పదేండ్లపాటు అధికారం లేనితనంతో ఆవురావురంటున్న కాంగ్రెస్ వారు ఇప్పుడు అవినీతితో విజృంభిస్తున్నారు. గెలిచిన కొత్తలోనే మొదలైన అవినీతి వీరవిహారం రోజులు గడిచేకొద్దీ అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నది. వారి విచ్చలవిడి తనానికి మరొకటి తోడవుతున్నది. తిరిగి గెలువగలమో లేదోనన్న భయం. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనే సైకాలజీ పై నుంచి కింది వరకు అందరికీ ఆవహించిపోయింది. ఢిల్లీకి కూడానా? కాదనటం కష్టమవుతున్నది.
కాంగ్రెస్ అవినీతి చరిత్ర కొత్తది కాదు. ఇప్పుడు తెలంగాణతో మొదలయినది అంతకన్నా కాదు. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నది ఆ పార్టీ సుదీర్ఘ చరిత్రకు కొనసాగింపు మాత్రమే. కాలం చాలా గడిచిపోయింది, చరిత్రలు చదివే అలవాటు కొత్త తరాలకు లేకుండా పోయింది గానీ, ఇందుకు సంబంధించిన మూడు ఉదంతాలను చెప్తే ఎవరైనా, (బహుశా కాంగ్రెస్ వారు కూడా) నిర్ఘాంతపోక తప్పదు. ఒకసారి 1920లలోకి వెళదాం. అది ఎప్పటిమాట! ఆ పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలను గమనించిన రాజగోపాలాచారి, జైళ్లలో ఉండవలసిన వారు బయటా, బయట ఉండవలసిన వారు జైళ్లలో ఉన్నారని అన్నారు. ఇది నమ్మశక్యం కాని మాట. అప్పటికి దేశానికి స్వాతంత్య్రం రావడం సంగతి అట్లుంచి ఇంకా స్వాతంత్య్రోద్యమమైనా పూర్తి బలం పుంజుకోలేదు. మరి అవినీతి, అక్రమాలకు పాల్పడింది ఎవరు?
దేశంలో ఆ సరికి ధనికవర్గం, విద్యాధిక వర్గం, కులీన వర్గం ఒకటి తగినంత ఉన్నది. వారిలో కొందరు బ్రిటిష్ వలస పాలకుల ప్రాపకంతో లాభపడుతుండగా, కొందరు ముందుచూపుతో కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటికీ వారిలో స్వప్రయోజనాలను వదలుకోలేని కొందరు తమ అక్రమ మార్గాలను వదలుకోలేదు. మరొకవైపు ఎందరో స్వాతంత్య్ర సాధన కోసం ఆందోళనలు సాగిస్తూ జైళ్ల పాలవుతున్నారు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి 1915లో తిరిగి వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించి అప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచింది. అటువంటి పరిణామాల మధ్య కూడా కొందరి అనైతికతను గమనించి బాధపడినందువల్లనే రాజాజీ అంతటివారు తీవ్రంగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్‌వాదుల్లో కొందరి తీరు మరొక పదేండ్లు గడిచినా మారకపోవడమే గాక మరింత పెరిగింది. ఇప్పుడు గుర్తుచేసుకునే రెండవ ఉదంతాన్ని చూసి మరింత ఆశ్చర్యం కలుగుతుంది.
స్వాతంత్య్రోద్యమ ఒత్తిడితో బ్రిటిష్ ప్రభుత్వం 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకటించింది. దాని ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి, పరిమితమైన స్వయంపాలన అన్నవి ముఖ్యమైనవి. అనగా, ప్రాంతాల్లో అధికారానికి వచ్చే పార్టీలు, నాయకులు, వర్గాలు ఏదో ఒక మేరకు తమ అధికారాన్ని చలాయించే అవకాశమన్నమాట. అది మామూలు అవకాశం కాదు. పైగా మొదటిసారి వస్తున్నది. అందువల్ల, ఆ చట్టం ప్రకారం మొదటి ఎన్నికలు 1937లో జరిగినప్పుడు, వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి తీరాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించుకుంది. ఉద్యమపార్టీ అయినందున యథాతథంగా కాంగ్రెస్ విజయంపై ఎవరికీ సందేహాలు అక్కరలేదు. కానీ, సాధారణ విజయం గాక, ఘనవిజయం సాధించాలన్నది అప్పుడు కాంగ్రెస్ కోశాధికారిగా ఉండిన వల్లభ్‌భాయ్‌పటేల్ పట్టుదల. అందుకోసం ఆయన ఒక సాధనంగా ధన బలాన్ని ఉపయోగించే ప్రణాళికను రచించారు.
ధనవంతుల నుంచి ధన సేకరణ ఆరంభించారు. ధన సేకరణ, ఎన్నికల్లో వినియోగం నీతివంతమైనవి కావని భావించిన గాంధీజీ, ఆ పద్ధతిని స్పష్టంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయంపై మాత్రమే ఆధారపడాలని చెప్పారు. కానీ పటేల్ లెక్కచేయలేదు.ఆ విధంగా, భారతదేశ చరిత్రలో ఎన్నికల్లో గెలిచేందుకు ధనవంతుల నుంచి ధన సేకరణ, ఎన్నికల్లో వినియోగం అనే అవినీతి మార్గానికి స్వాతంత్య్రం కన్నా ముందే శ్రీకారం జరిగింది.
ఇప్పుడు మూడవది చూద్దాము. 1937 తర్వాత పదేండ్లకు 1947లో దేశం స్వతంత్రమైంది. తర్వాత ఐదేండ్లకు 1951-52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు గల మధ్యంతర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండినప్పుడు అవినీతి పెచ్చు పెరిగిపోయింది. అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉండిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూకు ఒక హెచ్చరిక చేశారు. అవినీతిని అరికట్టనట్టయితే, ప్రజల్లో అప్పటికే మొదలైన వ్యతిరేకత వల్ల కొంత వెనుక ముందులుగానైనా కాంగ్రెస్‌కు సమస్యలు తప్పవని.
1952 మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1957లో రెండవ ఎన్నికలు వచ్చే సరికే కాంగ్రెస్ పలు రాష్ర్టాల్లో మెజారిటీని, కేరళలో అధికారాన్ని కోల్పోయింది. అందుకు గల ముఖ్య కారణాల్లో అవినీతి ఒకటి. ఇంకా తర్వాతి అవినీతి చరిత్రలోకి, వ్యతిరేక ఉద్యమాల్లోకి ఇక్కడ వెళ్లనక్కరలేదు గానీ, ఒకటి గుర్తుచేసుకోవాలి. స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీజీ అభిప్రాయపడటానికి అవినీతి కూడా ఒక కారణమేమో తెలియదు గానీ, అయి ఉంటే ఆశ్చర్యపడనక్కరలేదు. తను అటువంటి నైతికతలకు ప్రాధాన్యత ఇచ్చేవారు గనుక. యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ ప్రకటించిన ఏడు సామాజిక పాపాలులో కష్టం లేని సంపాదన మొట్టమొదటిది కాగా, సూత్రబద్ధత లేని రాజకీయం ఏడవది కావటం గమనించదగ్గది. ఆయన ఈ ఏడు పాపాలను ప్రకటించింది ఎప్పుడో తెలుసా? 1925లో ! అనగా ఇంచుమించు మనం పైన చెప్పుకొన్నట్టుగా రాజాజీ వ్యాఖ్యలు చేసిన సమయంలోనన్నమాట. ఇటీవలికి వస్తే ఆ పార్టీ కేంద్రంలో 2014లో అధికారం కోల్పోవటానికి ఒక ముఖ్య కారణం అవినీతి కుంభకోణాలు.
కాంగ్రెస్ అవినీతి రికార్డ్ గురించి ఇంతకన్నా చెప్పుకోవలసిన అవసరం లేదు. వారి అవినీతి కథలు ఆరంభ దశలోనే ఆ విధంగా ఉండగా, ఆ తర్వాతి దశలు భారతదేశపు వర్తమాన తరాలు చూస్తున్నవే అయినందున ఆ వివరణలు అంతకన్నా అవసరంలేదు. ఇదే సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సాగింది. వారిని పంది కొక్కులు అని ఎన్టీఆర్ అభివర్ణించారు.
ప్రజామోదంతో అధికారం నుంచి కూలదోశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో రెండుసార్లు చిత్తయ్యి, గతంలో వలె అవినీతి సంపాదనలు లేక పదేండ్లపాటు ఆవురావురంటుండిన వారికి ఇప్పుడు ఒక అవకాశం లభించింది. దానితో గత పదేండ్ల కరువుదీరా ఇప్పుడు విజృంభిస్తున్నారు. తమ వందేండ్ల (1925-2025) సంప్రదాయానికి మెరుగులు దిద్దుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకుల అవినీతి అన్ని స్థాయుల్లో విచ్చలవిడిగా సాగుతున్నదన్నది సర్వసాధారణంగా వినవస్తున్నమాట. అధికార యంత్రాంగం గురించి సరేసరి. మామూలుగానే భూములు, స్థలాలు ఖరీదైనవి కాగా, వాటి ధరలు 2014 నుంచి పెరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో భూముల కబ్జాలు మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆక్రమించటం ప్రభుత్వ భూములను వక్ఫ్ భూములు, పోరంబోకులు, గ్రామకంఠాలు, జలాశయ స్థలాలు, భూదాన భూములు, అసైన్డ్ భూములను ఏదో ఒక పేరిట కాజేయటం జరుగుతున్నట్టు నిత్యం వార్తలు వెలువడుతున్నాయి. పరిశ్రమల కోసమని, సుందరీకరణ అని, గాంధీ సరోవర్ ప్రాజెక్టు అని సాగుతున్న అరాచకానికి హైదరాబాద్ నగరం నుంచి లగచర్ల వంటి గిరిజన గ్రామాల వరకు పేదలు బలికావడం అంతులేకుండా సాగుతున్నది. హైడ్రా అరాచకాలకు కోర్టులను కూడా నిలువరించలేకపోతున్నాయి.
అవినీతి ఆదాయాన్నిబాగా తెచ్చిపెట్టే వాటిలో భూములు, స్థలాలది మొదటి స్థానం కాగా, ప్రాజెక్టులు, టెండర్లు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులది రెండవ స్థానం, గనులది మూడవ స్థానం అయినట్టు కనిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన ఆరోపణలపై స్పందనలు, విచారణలు ఉండవు. అడిగేవారు లేరు. ప్రజలకు తమ నిత్య జీవిత సమస్యలతో సంఘర్షించేందుకే సరిపోతున్నది. అవినీతి ప్రభావాలకు గురవుతున్నా చేయగలిగిందేమిటో వారికి బోధపడని స్థితి.
కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వానికి ఇక్కడి అధికారం వల్ల లభించే ఫలాలను అనుభవిస్తూ, తమ అధికార రాహిత్యంలో దిక్కుతోచక కొట్టుమిట్టాడటం మినహా మరొక స్పృహ ఉన్నట్టే తోచదు. ఆ విధంగా రాష్ట్ర కాంగ్రెస్‌ది గత రెండేండ్లుగా ఆట విడుపుగా మారింది. ఢిల్లీ నాయకత్వపు నిస్సహాయత, బలహీనతలు వీరికి పూర్తిగా కలిసివస్తున్నాయి. ఆ పరిస్థితి రాగల మూడేండ్ల కాలంలోనూ మారగల అవకాశాలు కనిపించడంలేదు. కనుక, ఆ తర్వాత ఏది ఎట్లా జరిగినా ఈ ఐదేండ్లపాటు మాత్రం గత పదేండ్ల కరువుదీరా దోచటమనే తీర్మానం జరిగిపోయినట్టున్నది.
-టంకశాల అశోక్