హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హిట్లర్ లాంటి నియంత పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే తాను హైడ్రాను ఏర్పాటు చేశానని సీఎం స్వయంగా ఒప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇతర సహచర కన్వీనర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి తనను తాను హిట్లర్‌తో పోల్చుకోవడం దేశానికే అవమానకరమని మండిపడ్డారు. తెలంగాణలో రేపు హిట్లర్ విగ్రహాలు పెట్టినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.
సీఎం వ్యాఖ్యలపై తాను పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు భయపడి తనపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. కేసు పెట్టిన సమాచారం కూడా తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం అవినీతిని బయటపెట్టినందునే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో సైబర్‌క్రైమ్ విభా గం కాస్తా.. రేవంత్‌రెడ్డి సైబర్ డ్యామేజ్ కం ట్రోల్ బ్యూరోలా మారిపోయింది’ అని ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరుపకుండా ముగ్గురు నామినేటెడ్ సభ్యులను ఎలా నియమించారని ప్రశ్నించారు. వెంటనే ఎన్నికలు జరుపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మానవత్వం లేకుండా కూల్చివేతలతోనే తన పాలన మొదలుపెట్టారని, ఇండ్లు కూల్చడాన్ని కూడా గొప్పగా చెప్పుకొంటున్నారని విమర్శించారు. ఇకనైనా నియంత పోకడలు మానుకోవాలని, లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ప్రపంచంలో ఏ రాజకీయ నేత కూడా హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పుకోలేదని మరో కన్వీనర్ జగన్మోహన్రావు గుర్తుచేశారు. ‘నేనే హిట్లర్ వారసుడిని అని సీఎం రేవంత్ ప్రకటించుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తీవ్ర ప్రమాదంలో ఉన్నారు. సామాన్య ప్రజలపై తీవ్రవాద చట్టాలను ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని విమర్శించారు.
ఒకవైపు కాంగ్రెస్ తాము గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలు పాటిస్తామని చెప్తుంటే, ఇకడి సీఎం రేవంత్ మాత్రం హిట్లర్ సిద్ధాంతం వల్లెవేస్తున్నారని బీఆర్ఎస్ మరో కన్వీనర్ దినేశ్ దరి విమర్శించారు. ఫాసిస్ట్ ధోరణి కలిగిన నాయకుడిని రాహుల్ ఎలా ప్రోత్సహిస్తున్నారో జెన్‌జీ గమనించాలని కోరారు. పేదల ఇండ్లు కూల్చడాన్ని గర్వంగా చెప్పుకోవడంపై మానవత్వం లేదని తేలిందని పేర్కొన్నారు.
విజ్ఞత లేకుండా మాట్లాడుతూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని మరో కన్వీనర్ పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలపై రుద్దినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.