Korremula Land Issue | ఆయనో మాజీ ఎమ్మెల్యే. దీనికితోడు ‘ముఖ్యనేత’తో దగ్గరి బంధుత్వం. ‘ముఖ్యనేత’ సతీమణికి మేనబావ. ప్రభుత్వ భూమిపై కన్నేసేందుకు ఇంతకన్నా అర్హత ఏం కావాలి? ఆయనా అదే చేశారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి ఓ ప్రైవేట్ బిల్డర్ చెరలో ఉండగా, దానిని దక్కించుకొనేందుకు ప్లాన్‌వేశారు. తన బంధుత్వాన్ని అడ్డుపెట్టుకొని బిల్డర్‌కు ధమ్కీ ఇచ్చారు. దీంతో రెండెకరాలు రాసిచ్చేలా వారిద్దరి మధ్య ఒప్పందం జరిగింది.
తొలి విడతగా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 1,930 చదరపు గజాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు బిల్డర్ అంగీకరించాడు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారగణం.. ‘ముఖ్యనేత’ బంధువు కావడంతో జీ హుజూర్ అన్నారు. అయినా నిబంధనలన్నింటినీ చెత్తబుట్టలో పడేసి దర్జాగా నిరుడు మార్చిలో 1,930 చదరపు గజాలకు రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే ఏకంగా ఎకరా భూమిని స్వాధీనం చేసుకొని ప్రహరీ కట్టాడు. జాతీయ రహదారి వైపు ఎనిమిది షెటర్లు వేసి దర్జాగా అద్దెకు ఇచ్చుకున్నారు. పక్కనే ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చేసిన హైడ్రా, ఈ షెట్టర్ల జోలికి పోలేదు.
బిల్డర్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇంకో ఎకరా భూమిని అప్పగించేందుకు డాక్యుమెంట్లు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉన్నది. ఈ వ్యవహారంలో ‘ముఖ్యనేత’ సతీమణికి అరెకరా ఇచ్చేలా ఒప్పందం జరిగింద ట. ఇక్కడ ఎకరా భూమి రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. అంటే నేరుగా కబ్జాలు, సెటిల్మెంట్లే కాదు.. పేరు వాడుకొనేందుకు అనుమతి ఇచ్చి, బదులుగా రూ.కోట్లు వసూలు చేసే స్థాయికి ముఖ్యనేత వర్గం వెళ్లిందన్న టాక్ వినిపిస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇప్పుడు కూడా ఈ భూమి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో రెవెన్యూ శాఖ పంపిన 22ఏ(నిషేధిత) జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నది. గతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంకటాద్రి టౌన్షిప్ పేరుతో 867 సర్వే నంబర్లోని కొంత భూమిని ఆక్రమించి వెంచర్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఎలాంటి క్రయవిక్రయాలు చేయవద్దని 2008 ఫిబ్రవరి 19న అప్పటి ఘట్కేసర్ ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ పంపారు. ఈ భూమిని ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చారు. ధరణి-2020, భూ భారతి-2025 రెవెన్యూ రికార్డుల ప్రకారం కూడా నేటికీ ప్రభుత్వ నిషేధిత జాబితాలోనే ఉన్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 22-ఏ నిషేధిత జాబితాను రూపొందించిన సమయంలోనూ మేడ్చల్ మలాజిగిరి జిల్లా కలెక్టర్ సర్వే నెంబర్ 867లోని 20.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదిగా పేరొంటూ నిషేధిత జాబితా (22-ఏ)లో చేర్చుతూ నివేదిక ఇచ్చారు.
కొర్రెముల రెవెన్యూ పరిధిలోని 870, 871, 872, 873, 875, 753, 853 లోని సుమారు 84.32 ఎకరాల భూమిలో ఓ రియల్టర్ చాలా ఏండ్ల కిందట వెంకటాద్రి టౌన్ షిప్ పేరుతో వెంచర్ చేశాడు. ఈ సర్వే నెంబర్లలోని భూములతో పాటు వాటిని ఆనుకొని ఉన్న 867లోని 20.32 ఎకరాల ప్రభుత్వ భూమిలో వరంగల్ హైవేకు సమీపంలోని భూమిని ఆక్రమించి పలు వెంచర్లు (వెంకటాద్రి టౌన్ షిప్) వేశాడు. అధికారులతో ఈ కబ్జా వ్యవహారం సెటిల్ చేసేందుకు అప్పటి మేడ్చల్ ఎమ్మెల్యే(ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) రంగంలోకి దిగారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో సదరు ఎమ్మెల్యే పాచిక పారలేదు. ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, ముఖ్యనేత’ సతీమణికి మేనబావగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 867 సర్వేనంబర్‌లోని భూమిని కైవసం చేసుకునేందుకు పాత ప్లాన్‌కు మళ్లీ పదును పెట్టారు.
ప్రభుత భూమిని కబ్జా చేయడం కుదరని పని. కానీ 867 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమికి అవన్నీ లేవు. ఎందుకంటే అప్పటికే అక్కడ ప్రైవేట్ బిల్డర్ ఉన్నాడు. అందుకే సదరు మాజీ ఎమ్మెల్యే ఆ బిల్డర్‌కు ఓ ధమ్కీ ఇచ్చారు. ‘ముఖ్యనేత’తో తన బంధుత్వాన్ని వాడుకున్నాడు. దీంతో బిల్డర్ దిగివచ్చి, రాజీగా రెండెకరాల భూ మిని మాజీ ఎమ్మెల్యే పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ‘ముఖ్యనేత’ సతీమణి పేరు ఎలాగూ వినియోగించుకుంటున్నందున ఆ మేరకు అర ఎకరం ఆమెకు ఇచ్చేందుకు అంతర్గత ఒప్పందం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలి విడతగా బిల్డర్ మాజీ ఎమ్మెల్యే పేరిట 1930 చదరపు గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. 2025 మార్చి 22న నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 2826\2025 ద్వారా 1930 చదరపు గజాల ప్రభుత్వ భూమిని సేల్‌డీడ్ పూర్తయింది. ఆ సమయానికి 867 సర్వేనెంబరులోని 20.32 ఎకరాలు నిషేధిత జాబితాలోనే ఉన్నది. కానీ రిజిస్ట్రేషన్ అధికారులకు ‘ముఖ్య’ వ్యక్తుల నుంచి ఆదేశాలు రావడంతో ఆగమేఘాల మీద సేల్‌డీడ్‌ను పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ‘దొరికిందే సందు’ అన్నట్టుగా ఆ మాజీ ఎమ్మెల్యే జాతీయ రహదారిని అనుసరించి ఏకంగా ఎకరం భూమిని తన స్వాధీనంలోకి తీసుకొని చుట్టూ ప్రహరీ నిర్మించారు. జాతీయ రహదారి వైపు ఎనిమిది షెట్టర్లను నిర్మించి, అద్దెకు ఇచ్చారు.
ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని కొందరు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది డిసెంబరు 8న హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయికి వెళ్లగా, అక్కడ సర్కార్ భూమిని కబ్జా చేసి షెటర్ నిర్మించి, అందులో వైన్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హైడ్రా అధికారులు క్షణాల్లో ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. అయితే దాని పక్కనే సదరు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిలో నిర్మించి దర్జాగా అద్దెకు ఇచ్చిన ఎనిమిది షెటర్లు ఉన్నా హైడ్రా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే.. గతంలో ఇలాంటి సందర్భాల్లో ఇచ్చే జవాబు ఎలాగూ ఉంది కదా! అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమకు ఫిర్యాదు అందలేదనో, 867 సర్వేనెంబరుపై రెవెన్యూ శాఖను వివరణ కోరాం గానీ అక్కడి నుంచి పూర్తి వివరాలు రాలేదనే సమాధానం వస్తుందని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఘట్కేసర్ మండల తహసీల్దార్ చంద్రశేఖర్‌ను ఫోనులో సంప్రదించగా ఫోన్ కాల్‌కు స్పందించలేదు.
మాజీ ఎమ్మెల్యే 867 సర్వే నెంబర్లో ఎకరం ఆక్రమించినా.. అంతర్గత ఒప్పందం మేరకు ‘ముఖ్యనేత’ సతీమణికి అరెకరం ఇవ్వలేదు. దాదాపు ఏడాది గడుస్తున్నా ఒప్పందం అమలు కాకపోవడం, తన పేరుమీద రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ‘ముఖ్యనేత’కు సమాచారం చేరినట్టు తెలిసింది. దీంతో ‘ముఖ్యనేత’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల జిల్లా కీలక నేత కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ‘ముఖ్యనేత’.. సదరు మాజీ ఎమ్మెల్యేను కనీసం పలుకరించకుండా వెళ్లిపోయారని చెప్పుకొంటున్నారు. దీని వెనుక ‘అర ఎకరం అసంతృప్తి’ దాగి ఉందని అధికార పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. బిల్డర్‌తో కుదిరిన రెండెకరాల ఒప్పందంలో మిగతా భూమి రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే డాక్యుమెంట్లు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలిసింది. అయితే అర ఎకరం పీటముడి ఉండటంతో ఫైల్ డోలాయమానంలో పడినట్టు సమాచారం. కొన్నిరోజుల కిందట జిల్లా కలెక్టర్ 867 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిపై అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఆ భూమిలో ఎలాంటి లావాదేవీలు జరుపవద్దని చెప్పినట్టు సమాచారం. కానీ సదరు మాజీ ఎమ్మెల్యే చేయించుకున్న సేల్‌డీడ్ మాత్రం రద్దు చేయలేదట. ‘అర ఎకరం’ అసంతృప్తి నేపథ్యంలో తదుపరి కబ్జా పర్వాన్ని అడ్డుకున్నారని ప్రచారం జరుగుతున్నది.