Balapur ZPHS | బడంగ్పేట్, మే 2 : బాలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఇసుక డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు. ఈ నెల 4న నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పటికే పరీక్ష కేంద్రాన్ని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి, డిప్యూటీ తహసీల్దార్ మణిపాల్ రెడ్డి, పరీక్షల అబ్జర్వర్లు నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఇసుక దిబ్బలను, కంకర, డస్ట్, సిమెంటు గ్రౌండ్ నిండా వేసి ఉండడంతో అవాక్కయ్యారు.
నీట్ పరీక్ష ఉందని స్థానిక ప్రధానోపాధ్యాయుడు చెప్పినప్పటికీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్ గ్రౌండ్ నిండా ఇసుక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్లో ఉన్న వాటిని మొత్తం తొలగించాలని మూడు రోజులుగా చెబుతున్నప్పటికీ వినకుండా సదరు కాంట్రాక్టర్ ఓ అధికార పార్టీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్ గ్రౌండ్లో ఉంటే ఏమవుతుందని ఉపాధ్యాయులను బెదిరించినట్లు సమాచారం.
నీట్ పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్యలు ఉండకూడదని జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలుమార్లు మండల స్థాయి అధికారులు పాఠశాలను పరిశీలించి అక్కడున్న వసతుల గురించి ఆరా తీశారు. అధికార పార్టీ నేతల తీరుతో అధికారులు విసుక్కుంటున్నారు. పైఅధికారులకు సమాధానం చెప్పుకోలేక తర్జన భజన పడుతున్నారు. ఇదంతా బడంగ్పేట్ మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్ల సూచనలతోని కాంట్రాక్టర్ పాఠశాలలో ఇసుక డంపింగ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ డంపింగ్ యార్డులు ఇలానే ఉంటే నీటు పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు మండిపడుతున్నారు. పక్కన ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ పాఠశాలలో ఇసుక డంపింగ్ చేయడం ఏంటని స్థానికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులలో విద్యార్థులు ఆడుకోవడానికి వీలు లేకుండా గ్రౌండ్ నిండా కంకర, ఇసుక, డస్టు, సిమెంట్‌తో నింపి వేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇసుక డంపింగ్ యార్డ్ తీయకపోతే పై అధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు పాట్లు తప్పేటట్లు లేదు. పాఠశాల గ్రౌండ్లో ఉన్న వాటిని తొలగించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని అధికారులు పేర్కొంటున్నారు.
గ్రౌండ్లో ఉన్న ఇసుక డంపింగ్ తొలగించాలని మూడు రోజులుగా చెబుతున్నామని బాలాపూర్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు తెలిపారు. అయినా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఆదివారం నాడు పాఠశాలలో నీట్ ఎగ్జామ్ ఉంది. గ్రౌండ్ నిండా ఇసుక, కంకర, డస్టు, సిమెంటు వేశారు. పరీక్ష సమయంలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. గ్రౌండ్లో ఉన్న వాటిని తొలగించాలని పదేపదే చెప్తున్నాము. ఎవరు వినడం లేదు. రెండు రోజులలో తొలగించకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం అని ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు పేర్కొన్నారు.