జూలూరుపాడు, ఏప్రిల్ 2 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో అనర్హుల పేర్లు తొలగించి, అర్హులకు ఇవ్వాలని, అలాగే గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అర్హులకు అన్యాయం జరిగిందని పంచాయతీ కార్యదర్శిని స్థానిక మహిళలు నిలదీశారు. గ్రామంలో ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు సైతం ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలు నమోదు చేసుకుని కనీస విచారణ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పినా న్యాయం మాత్రం జరగడం లేదని ఆరోపించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వేసవిలో కనీసం మంచినీరు సరఫరా చేయలేని ఎమ్మెల్యే వల్ల ప్రయోజనం ఏమిటని, అధికారులు ఎందుకని వారు ప్రశ్నించారు.
Julurupadu : గుండెపుడిలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ధర్నా
Julurupadu : గుండెపుడిలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ధర్నా