సిద్దిపేటలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు షురూ

సిద్దిపేట కలెక్టరేట్, ఫిబ్రవరి 18: సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో 6వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు గురువారం మొదలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల నుంచి ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘వాలీబాల్ గ్రామీణ ప్రాంత క్రీడ..యువతకు అందుబాటులో ఉండి తక్కువ ఖర్చుతో ఆడే ఆట. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమైనవి. రాబోయే రోజుల్లో సిద్దిపేట మరిన్ని క్రీడలకు వేదికగా మారనుంది. త్వరలో ఇక్కడ వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి, జెడ్పీ చైరపర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.