నల్లగొండ : నల్లగొండ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తాం. ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) బీఆర్ఎస్ పార్టీ(BRS) విజయం సాధిస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు.పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థం అయింది.
రుణమాఫీ పై మాట మార్చారు. ఆ పార్టీ అన్నదాతలను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ బూతులు తిడుతూ.. అబద్ధాలు ఆడుతూ..కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. ఇక్కడున్నా ఓ జిల్లా మంత్రి రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని అన్నాడు. వాళ్లనే చెప్పుతో కొట్టేందుకు రైతులు రెడీగా ఉన్నారని హెచ్చరించారు. సాగు, తాగుకు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు ఈ మంత్రులు అని మండిపడ్డారు.
కేసీఆర్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది. పదవుల కోసం నోరు ముసుకున్న నాయకులు కాంగ్రెస్ వాళ్లు. కాంగ్రెస్ వాళ్లను తన్ని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సాగర్ నీళ్లను దోచుకు పోతుంటే మంత్రులు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. సాగర్ డ్యామ్ మీదకు పోయే దమ్ము వీళ్లకు లేదు. రేపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి వీటి అన్నిటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.