బుధవారం 05 ఆగస్టు 2020
Sports - Aug 01, 2020 , 19:39:35

5 నుంచి తెలంగాణలో మొదలుకానున్న క్రీడలు

5 నుంచి తెలంగాణలో మొదలుకానున్న క్రీడలు

హైదరాబాద్ : రాష్ట్రంలో క్రీడలను తిరిగి ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం ప్రముఖ క్రీడాకారులు, కోచ్‌లతో పాటు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన సమావేశంలో ఆగస్టు 5 నుంచి క్రీడా సౌకర్యాలు, జిమ్‌లు, యోగా కేంద్రాలను తెరవవచ్చు, కాని సగం సామర్థ్యంతో మాత్రమే ప్రారంభించేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సదుపాయాలన్నీ కేంద్రం ఏర్పాటు చేసిన కొవిడ్ -19 నిబంధనలను పాటించాలని మంత్రి ఉద్ఘాటించారు. ఇండోర్ స్టేడియాలలో అథ్లెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరాన్ని కొనసాగించడం, శానిటైజర్లను ఉపయోగించడం, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లను విడుదల చేసిందని, వాటిని తప్పక పాటించాలని మంత్రి అన్నారు.

రాష్ట్ర క్రీడా విధానాన్ని రూపొందించడంలో అథ్లెట్లు, కోచ్‌లు సలహాలతో ముందుకు రావాలని శ్రీనిన్‌వాస్ గౌడ్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఎటువంటి టోర్నమెంట్ నిర్వహించరని మంత్రి స్పష్టం చేశారు. భారత మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, అథ్లెటిక్స్ కోచ్ ఎన్ రమేశ్, షట్లర్లు సాయి ప్రణీత్, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివిధ సలహాలను ఇచ్చారు.


logo