South Africa : ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టును విధి వెక్కిరించేది. టోర్నీ ఆసాంతం ఎంత బాగా ఆడినా సరే తీరా ఫైనల్‌కు వచ్చే సరికి ఒత్తిడి ఆవహించేది. అలా మూడు పర్యాయాలు ఆఖరి మెట్టుపై తడబడి ఛాంపియన్ ట్యాగ్‌ను చేజార్చుకుంది దక్షిణాఫ్రికా (South Africa). మార్క్ బౌచర్, షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్ (Jacques Kallis), ఏబీ డివిలియర్స్ (AB deVilliers), గ్రేమ్ స్మిత్ వంటి దిగ్గజాలు సైతం జట్టుకు ఐసీసీ ట్రోఫీని అందించలేకపోయారు. 27 ఏళ్లుగా తమకు అందని ద్రాక్షలా మారిన ఐసీసీ ట్రోఫీని తెంబ బవుమా (Temba Bavuma) బృందం సాధించింది. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది.
ఆ దేశం నుంచి పురుషుల జట్టే కాదు మహిళల టీమ్ కూడా ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలిచిన దాఖలాలు లేవు. ఎప్పుడో 1998లో ఐసీసీ నాకౌట్ టోర్నీలో దక్షిణాఫ్రికా పురుషుల జట్టు విజేతగా నిలిచింది. 2023లో మహిళలు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరినా.. ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయారు.
నిరుడు పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన మర్క్రమ్ సారథ్యంలోని ప్రొటీస్ జట్టు బార్బడోస్ గడ్డపై టీమిండియా చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకుందాం అనుకునేలోపే.. మహిళల పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ జోరు ముందు నిలువలేక కప్‌ను వదులుకుంది లారా వొల్వార్డ్త్ బృందం. దాంతో.. ఐసీసీ టోర్నీల్లో మూడోసారి దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడిందని యావత్ క్రీడాలోకం నిట్టూర్చింది.
It’s been a near 27-year wait for an ICC trophy for South Africa ⌛ pic.twitter.com/NoHfWA0aZl
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2025
కానీ, లార్డ్స్‌లో తెంబ బవుమా సారథ్యలోని సఫారీ జట్టు అద్బుతం చేసింది. 27 ఏళ్లుగా తమకు అందని ద్రాక్షలా మారిన ఐసీసీ ట్రోఫీని ఒడిసిపట్టింది. అలా అనీ చిన్నా చితకా జట్టుపై గెలిచి కాదు.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి విజేతగా అవతరించింది. దాంతో.. ఇకపై తాము చోకర్స్ కాదు ఛాంపియన్లం అని సగర్వంగా ప్రపంచానికి చాటారు సఫారీ ఆటగాళ్లు.
ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే దక్షిణాఫ్రికా చిరకాల కోరిక నెరవేరింది. లార్డ్స్‌లో తొలి రోజు నుంచి రసవత్తరంగా సాగుతూ.. ఆధిపత్యం చేతులు మారిన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఏళ్లుగా తమను ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ను ఒడిసిపట్టింది. పేసర్లు కగిసో రబడ(4-59), లుంగి ఎంగిడి(3-38)ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 207కే ఆలౌట్ చేసిన సఫారీ జట్టు.. 282 పరుగుల ఛేదనలో అదరగొట్టింది. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్ (136) చిరస్మరణీయ సెంచరీతో కదం తొక్కగా.. చీలమండ గాయంతో బాధపడుతూనే సారథి తెంబ బవుమా(66) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు.
Nine wickets in the match for Kagiso Rabada 🇿🇦
A special performance on the biggest stage 💪#KagisoRabada #WTCFinal pic.twitter.com/tEpz2Sl57H
— Wisden (@WisdenCricket) June 13, 2025
మూడో రోజు టీ సెషన్ తర్వాత ఆసీస్ బౌలర్లను విసిగిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారిద్దరూ. చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూ లక్ష్యాన్ని కరిగించిందీ జోడీ. మరికాసేపట్లో మూడో రోజు ఆట ముగుస్తుందనగా హేజిల్‌వుడ్ ఓవర్లో బౌండరీతో మర్క్రమ్ శతకం సాధించాడు. దాంతో, 214 పరుగులతో రోజును ముగించింది సఫారీ జట్టు.
మర్క్రమ్ (136)
నాలుగో రోజు విజయానికి 69 పరుగులు అవసరం కాగా.. తొలి సెషన్లో మ్యాచ్ ముగించాలనుకున్నారు మర్క్రమ్, బవుమా. కానీ.. రెండో రోజు 6 వికెట్లతో నిప్పులు చెరిగిన కమిన్స్.. తన రెండో ఓవర్లోనే బవుమాను ఔట్ చేసి దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ఆ కాసేపటికే ట్రిస్టన్ స్టబ్స్(8)ను స్టార్క్ బౌల్డ్ చేసినా మర్క్రమ్, డేవిడ్ బెడింగమ్(21 నాటౌట్) ద్వయం కంగారూ పడలేదు. హేజిల్‌వుడ్ ఓవర్లో మిడ్‌వికెట్ దిశగా మర్క్రమ్ రెండు ఫోర్లు బాదాడు. అయితే.. చరిత్రాత్మక విజయానికి 6 పరుగులు అవసరం కాగా హేజిల్‌వుడ్ ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయిన మర్క్రమ్.. హెడ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కైలీ వెర్రిన్నే(7 నాటౌట్) స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ బాదగా .. బవుమా బృందం 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ ట్యాగ్ సొంతం చేసుకుంది.