WTC Final : అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. 27 ఏళ్లుగా కళ్లలో వొత్తులు వేసుకొని ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా (South Africa) కల ఎట్టకేలకు సాకారం అయింది. ఆస్ట్రేలియా (Australia) గోడను బద్ధలు కొడుతూ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2023-25) ఫైనల్లో సఫారీ జట్టు విజేతగా అవతరించింది. లార్డ్స్ మైదానంలో వేలాది ప్రేక్షకుల సమక్షంలో టెస్టు గద (Testt Mace)ను మురిపెంగా గుండెలకు హత్తుకుంది.
ఆసీస్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్య ఛేదనలో ఎడెన్ మర్క్రమ్(136) చిరస్మరణీయ సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ తెంబ బవుమా(66) అద్భుత బ్యాటింగ్‌తో అలరించగా.. డేవిడ్ బెడింగమ్(21 నాటౌట్)జతగా మర్క్రమ్ జట్టును గెలుపు వాకిట నిలిపాడు. అయితే.. విజయానికి 6 పరుగులకు ముందు అతడు ఔటైనా.. కైలీ వెర్రిన్నే(7 నాటౌట్), బెడింగమ్ లాంఛనం పూర్తి చేయగా.. 5 వికెట్ల తేడాతో సఫారీ టీమ్ గెలుపొందింది. అంతే.. డబ్ల్యూటీసీలో కొత్త ఛాంపియన్ ఆవిర్భవించింది. తొలి రెండు సీజన్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా విజేతగా నిలవగా.. ఈసారి తమ వంతు అని సఫారీ జట్టు టెస్టు గదను తన్నుకుపోయింది.
HISTORY IS MADE! SOUTH AFRICA ARE WORLD TEST CHAMPIONS! 🇿🇦🏆 pic.twitter.com/Mujy5gJ3l3
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2025
ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే దక్షిణాఫ్రికా కల నిజమైంది. లార్డ్స్‌లో తొలి రోజు నుంచి రసవత్తరంగా సాగుతూ.. ఆధిపత్యం చేతులు మారిన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ జట్టు జయకేతనం ఎగురవేసింది. ఏళ్లుగా తమను ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌ను ట్రోపీని ఒడిసిపట్టింది. కగిసో రబడ(4-59), లుంగి ఎంగిడి(3-38)ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 207కే ఆలౌట్ చేసిన సఫారీ జట్టు.. 282 పరుగుల ఛేదనలో అదరగొట్టింది. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్ (136) చిరస్మరణీయ సెంచరీతో కదం తొక్కగా.. చీలమండ గాయంతో బాధపడుతూనే సారథి తెంబ బవుమా(66) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు.
14th June, 2025 – South Africa’s greatest moment in international cricket 🏆
What a special knock from Aiden Markram 👏#WTCFinal #SAvAUS pic.twitter.com/TfGsKNJVpu
— Cricbuzz (@cricbuzz) June 14, 2025
మూడో రోజు టీ సెషన్ తర్వాత ఆసీస్ బౌలర్లను విసిగిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారిద్దరూ. చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూ లక్ష్యాన్ని కరిగించిందీ జోడీ. మరికాసేపట్లో మూడో రోజు ఆట ముగుస్తుందనగా హేజిల్‌వుడ్ ఓవర్లో బౌండరీతో మర్క్రమ్ శతకం సాధించాడు. దాంతో, 214 పరుగులతో రోజును ముగించింది సఫారీ జట్టు. నాలుగో రోజు విజయానికి 69 పరుగులు అవసరం కాగా.. తొలి సెషన్లో మ్యాచ్ ముగించాలనుకున్నారు మర్క్రమ్, బవుమా.
కానీ.. రెండో రోజు 6 వికెట్లతో నిప్పులు చెరిగిన కమిన్స్.. తన రెండో ఓవర్లోనే బవుమాను ఔట్ చేసి దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ఆ కాసేపటికే ట్రిస్టన్ స్టబ్స్(8)ను స్టార్క్ బౌల్డ్ చేసినా మర్క్రమ్, డేవిడ్ బెడింగమ్ (21 నాటౌట్) ద్వయం కంగారూ పడలేదు. హేజిల్‌వుడ్ ఓవర్లో మిడ్‌వికెట్ దిశగా మర్క్రమ్ రెండు ఫోర్లు బాదాడు. అయితే.. చరిత్రాత్మక విజయానికి 6 పరుగులు అవసరం కాగా హేజిల్‌వుడ్ ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయిన మర్క్రమ్.. హెడ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కైలీ వెర్రిన్నే(7 నాటౌట్) స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ బాదగా .. బవుమా బృందం 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ ట్యాగ్ సొంతం చేసుకుంది.
THE WAIT IS OVER, SOUTH AFRICA! 🏆 pic.twitter.com/AyOZw7YWNw
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2025