హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నటిస్తూ రాష్ట్రంలో మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం.. ఎస్ఎల్బీసీ ఘటనపై మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, కిశోర్ గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
ప్రజలను పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ కమిషన్లు, కేసుల పేరిట కుట్రలకు తెరలేపిందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూలిపోయిందని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ లాంటి విఫల ప్రాజెక్టును చేపట్టి కాంగ్రెస్ 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నదని నిప్పులు చెరిగారు. ఇప్పుడు సహాయక చర్యలు నిలిపివేసి చేతులెత్తేసిందని విమర్శించారు.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలకడం విడ్డూరమన్నారు. టీబీఎం డిజైన్‌కే మూడేళ్లు పడుతుందని .. మరి రెండేళ్లలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టిపెట్టి ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
కాళేశ్వరం కమిషన్ విషయంలో నివేదిక తుది దశకు వచ్చింది..
సీఎంగా ఉండి కమిషన్ పనిచేస్తున్నప్పుడు దాని విషయం బయట మాట్లాడడం అనైతికం.. నిజంగా ఆధారాలు ఉంటే కమిషన్ కు అందించాలి గానీ బహిరంగంగా ఎలా మాట్లాడతావ్ రేవంత్?– మాజీ మంత్రి @SingireddyBRS #KaleshwaramProject pic.twitter.com/OeZDiE6FCq
— BRS Party (@BRSparty) June 14, 2025
బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఇటీవల ఏపీ పర్యటనకు వెళ్లిన బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ కంటే పది రెట్లు ఏపీకి నిధులు ఇచ్చామని మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమేనని తప్పు పట్టారు. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుల సైతం రేవంత్ సర్కారుకు వంతపాడుతున్నారని అన్నారు.