న్యూఢిల్లీ, మార్చి 10: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ జరిగింది. ఓం బిర్లాను పెద్ద మనిషిగా కొనియాడుతూనే విపక్షంపై ఆయన తీసుకున్న కఠిన చర్యలను ప్రతిపక్ష సభ్యులు ఎండగట్టారు. ఈ ఆరోపణను ఖండించిన అధికార కూటమి విపక్ష సభ్యుల అరాచక ప్రవర్తనను అడ్డుకునేందుకే స్పీకర్ అలా ప్రవర్తించారని చెప్పారు. డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు సహా పలువురు విపక్ష ఎంపీలు ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్ లొంగిపోయారని ఆరోపించారు.
స్పీకర్ను తాను వ్యక్తిగతంగా ఎంతో గౌరవిస్తానని, కాని ఆయన తన ప్రవర్తనను సరిదిద్దుకోవలసి ఉంటుందని టీఆర్ బాలు పేర్కొన్నారు. స్పీకర్ ఓం బిర్లా చాలా పెద్ద మనిషి. కాని ఆయన ఎందుకు మారిపోయారో తెలియడం లేదు. గత ఏడేండ్లలో ఆయన చాలామంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు. అంత కఠిన చర్యలను ఎందుకు తీసుకోవలసి వచ్చింది? స్పీకర్ నిజాయితీగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను అని టీఆర్ బాలు సూచించారు.
దీనికి ఎన్డీఏ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పందిస్తూ 2019 నుంచి మొదటిసారి స్పీకర్గా నియమితులైన నాటి నుంచి ఓం బిర్లా సభను ఎంతో హుం దాగా, నిజాయితీగా నడుపుతున్నారని ప్రశంసించారు. శివసేన(యూబీటీ) సభ్యుడు అరవింద్ సావంత్ కూడా ఓం బిర్లాను పెద్ద మనిషిగా కీర్తించారు. అయితే విపక్షానికి వ్యతిరేకంగా పనిచేయాలని ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.