జగిత్యాల, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్ధరించడంతో పాటు, తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటును పరిశీలించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ మరమ్మతులు చేపట్టాలని, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లోను సమస్యలు ఉంటే పరిష్కరించాలని సూచించిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ్మిడిహట్టిని నిర్మిస్తామని, ప్రాణహిత నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తీసుకువచ్చి, ఉత్తర తెలంగాణతోపాటు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు అందిస్తామని పార్టీ అధినేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఈ పనులు చేపట్టకపోవడం బాధాకరమని విమర్శించారు.
మేడిగడ్డ పునరుద్ధరణ, తమ్మిడిహట్టి బ్యా రేజ్ నిర్మాణం పూర్తికాకపోతే.. గోదావరి, ప్రాణహిత నీటిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరలించుకుపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు కేంద్రంలో ఉన్న పరపతితో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువచ్చారని, శరవేగంగా పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. పార్టీ మారుతున్నారంటూ వ్యాఖ్యలు వి నిపిస్తున్నాయని వి లేకరులు జీవన్‌రెడ్డిని ప్రశ్నించగా.. అసంతృప్తిగా ఉన్నప్పుడు ఇలాంటివి సహజమేనని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల అభిప్రాయం ప్రకారమే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.