దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. అమెరికా-ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తకర వాతావరణం, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్ లేదా క్యూ1)గాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం.. మదుపర్లను అమ్మకాల ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారంతో పోల్చితే గత వారం సెన్సెక్స్ 2,091.68 పాయింట్లు క్షీణించి 76,059.77 వద్ద నిలిచింది. నిఫ్టీ 566.85 పాయింట్లు పతనమై 23,767.45 దగ్గర స్థిరపడింది. ఇక ఈ వారం ముడి చమురు ధరలు, క్యూ1 ఆర్థిక ఫలితాలకుతోడు.. మంగళ, బుధవారాల్లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్షలో తీసుకొనే నిర్ణయాలు కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల కదలికలకు కీలకం కానున్నాయి. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం సైతం ప్రధానమే. కాగా, బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ షేర్లలో సెల్లింగ్ ప్రెషర్‌కు అవకాశాలున్నాయి. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,000-24,200 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు.
ఇల్లు కొంటున్నారా?.. ఈ పత్రాలను సరిచూసుకోండి