కొత్త కార్మిక చట్టాల కింద కొందరు ఉద్యోగులకు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) చందాని చట్టబద్ధ పరిమితికి తగ్గించుకొనే వెసులుబాటు లభిస్తున్నది. దీనివల్ల వారికి చేతికొచ్చే నెలవారీ జీతం కూడా పెరుగగలదు. అయితే ఇక్కడే రెండు ప్రశ్నలు ప్రధానంగా తలెత్తుతున్నాయి. ఒకటి.. రిటైర్మెంట్ అనంతర నిధి. మీరు తీసుకొనే నిర్ణయం మీ ఉద్యోగ పదవీ విరమణ తర్వాత అందే మొత్తాలను పెద్ద ఎత్తునే తగ్గించే అవకాశాలున్నాయి మరి. మరొకటి.. పీఎఫ్ చందాని తగ్గించుకోవడం వల్ల తక్షణమే పెరుగుతున్న మీ జీతాన్ని క్రమశిక్షణగా పెట్టుబడులకు వినియోగిస్తారా? లేదా సాదాసీదాగా ఖర్చుపెట్టేస్తారా? అన్నది. అసలు ఈపీఎఫ్ చందా తగ్గింపుపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?
ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రకాశ్‌కు నెలకు లక్ష రూపాయల జీతం. దీంట్లో బేసిక్ పే, డీఏ కలిపి రూ.50 వేలుగా ఉన్నది. కంపెనీ యాజమాన్యం పాత విధివిధానాల ప్రకారం ఇందులో 12 శాతాన్ని (రూ.6,000) పీఎఫ్‌గా కోత పెడుతూ వస్తున్నది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. చట్టబద్ధ వేతన పరిమితిగా ఎప్పట్నుంచో ఉన్న రూ.15,000 (బేసిక్ పే-డీఏ కలిపి) ప్రకారం 12 శాతాన్ని (రూ.1,800) చెల్లిస్తే చాలు. ఉద్యోగి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇది తప్పనిసరిగా చెల్లించాల్సిందే. కానీ ఇప్పుడు ఆపై మొత్తాన్ని (రూ.6,000లలో రూ.1,800 పోగా మిగిలేది) చెల్లించాలా? వద్దా? అన్నది మాత్రం పూర్తిగా ఉద్యోగి ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. దీంతో తమ కంపెనీ హెచ్ఆర్ విభాగానికి తెలిపి, వారి అనుమతితో అధిక పీఎఫ్ చెల్లింపునకు స్వస్తి (ఈపీఎఫ్ రూల్స్, డాక్యుమెంటేషన్‌కు లోబడి ఉంటుందని మరువద్దు) పలుకాలని ప్రకాశ్ భావిస్తున్నాడు. దీనివల్ల అతని నెలవారీ జీతం రూ.4,200 పెరుగుతుంది. మరి ఇది ఎంతవరకు లాభం? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఐదేండ్లు దాటితే నో టీడీఎస్!
ఎలాంటి అంతరాయం లేకుండా ఐదేండ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ ఉపసంహరణలపై పన్ను (టీడీఎస్) వర్తించదు. ఒకవేళ ఉద్యోగంలో చేరిన ఐదేండ్లలోపే విత్‌డ్రాయల్స్‌కు దిగితే సదరు మొత్తాలు మీ వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబు పరిధిలోకి వస్తాయి. అయితే ఉపసంహరణలు రూ.50,000 మించితే (పాన్ లింకైతే)నే 10 శాతం టీడీఎస్ ఉంటుంది. అయినప్పటికీ ఫామ్ 15జీ సమర్పిస్తే చెల్లించనక్కర్లేదు. సీనియర్ సిటిజన్లు ఇందుకోసం ఫామ్ 15హెచ్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక పాన్ లింక్ కానివారికి గరిష్ఠంగా 34.6 శాతం టీడీఎస్ కోత ఉంటుంది.
ఇదీ సంగతి..
చట్టబద్ధ వేతన పరిమితిగా ఎప్పట్నుంచో ఉన్న రూ.15,000 (బేసిక్ పే-డీఏ కలిపి, డీఏ లేకపోతే బేసిక్ పే ఆధారంగానే) ప్రకారం 12 శాతాన్ని (రూ.1,800) ఉద్యోగి తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి వేతనంలో బేసిక్ పే, డీఏ నెలకు రూ.10,000గా ఉంటే అందులో 12 శాతం (రూ.1,200) చెల్లించాలి. అలాగే ఎంప్లాయి సాలరీలో నుంచి ఎంతైతే ఈపీఎఫ్‌కు వెళ్తుందో.. దానికి సమానంగా కంపెనీ యాజమాన్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అందులో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)కు వెళ్తుంది. మిగతా 3.67 శాతమే ఈపీఎఫ్‌లో జమవుతుంది. కానీ ఉద్యోగుల జీతాల్లో కట్ చేసే 12 శాతం కంట్రిబ్యూషన్ మొత్తం ఈపీఎఫ్‌కే వెళ్తుంది. ఒకవేళ పీఎఫ్‌కు ఉద్యోగి అధికం (భవిష్యత్తులో ఎక్కువ నిధి కోసం)గా చెల్లించాలనుకుంటే దానికి అనుగుణంగా కంపెనీలు చెల్లించాలన్న నిబంధనేది లేదు. అందుకే ఉద్యోగి ఇష్టప్రకారమే కొన్ని కంపెనీలు వారి వాస్తవ బేసిక్ పే, డీఏ మొత్తాల ఆధారంగా సాలరీ నుంచి ఈపీఎఫ్‌ను కట్ చేస్తున్నాయి. అలాకానిపక్షంలో బేసిక్ పే, డీఏ మొత్తాలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. చట్టబద్ధ వేతన పరిమితి (రూ.15,000) ప్రకారమే కట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది ఉద్యోగుల జీతాల్లో ఈపీఎఫ్ చందా రూ.1,800గానే ఉంటున్నది. దీనికి సమానంగా కంపెనీలూ నెలనెలా రూ.1,800 జమ చేస్తున్నాయి. ఈ లెక్కన (మొత్తం రూ.3,600లలో) ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో రూ.2,350.. ఉద్యోగి వాటా రూ.1,800 (12 శాతం), కంపెనీ వాటా రూ.550 (3.67 శాతం) జమవుతున్నది. కంపెనీ వాటాలో మిగతా రూ.1,250 (8.33 శాతం) ఈపీఎస్‌లోకి వెళ్తుంది. అయితే ఉద్యోగి, యాజమాన్యం పరస్పర అంగీకారానికి వస్తే.. కంపెనీ పాలసీ అనుకూలంగా ఉంటే ఎంప్లాయి బేసిక్ పే, డీఏల ఆధారంగానే యాజమాన్యాలూ ఈపీఎఫ్, ఈపీఎస్‌లకు అధిక చెల్లింపులు చేసే వీలుంటుంది.
నిపుణుల మాటేంటి?
బేసిక్ సాలరీ రూ.50,000 ఉన్నైట్టెతే.. 12 శాతం లెక్కన ఈపీఎఫ్‌కు ఉద్యోగి ద్వారా రూ.6,000 వెళ్తుంది. దీన్ని ఉద్యోగి రూ.1,800కే పరిమితం చేసుకుంటే.. రూ.4,200 మిగులుతాయి. అయితే ఇప్పుడున్న ఈపీఎఫ్ వడ్డీరేటు 8.25 శాతం ప్రకారం 25 ఏండ్లలో సదరు మిగులును తీసుకోవడం వల్ల ఉద్యోగికి దాదాపు రూ.41-42 లక్షల నష్టం వస్తుంది. ఒకవేళ ఉద్యోగి నిర్ణయానికి తగ్గట్టు కంపెనీ చందాలు కూడా తగ్గితే.. నష్టం రూ.80 లక్షలపైనే. మరోవైపు జీతంలో పెరిగే మొత్తాలు వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబు పరిధిలోకి వస్తాయి. కానీ అదే సొమ్ము ఈపీఎఫ్‌లో ఉంటే పన్ను ప్రయోజనాలుంటాయి. – నిషా సంఘవి, ప్రోమోర్ ఫిన్‌టెక్ వ్యవస్థాపక డైరెక్టర్