నల్గొండ : రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ( MLC Election ) బీఆర్ఎస్ అభ్యర్థి ( BRS Candidate ) గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ( Nomula Bhagat Kumar ) అన్నారు. హాలియాలో నాగార్జునసాగర్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల సన్నాహక సమావేశం ట్రైకర్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్లుపెరిగే అవకాశం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామంలో ఉన్న గ్రాడ్యుయేషన్ గుర్తించి వారిచే ఓటు నమోదు చేయించాలని సూచించారు. గతంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దిలీప్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకున్న ఘనత బీఆర్ఎస్కు ఉందని వెల్లడించారు.
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా విద్యార్థి, యువతను, నిరుద్యోగుల న ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పట్టభద్రులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లను విడదీసి ప్రజల మధ్య విద్వేషాలు కలిగే విధంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యల నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని విమర్శించారు.
స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో కలిసి పనిచేస్తే త్వరలో జరిగే నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం తథ్యమని జోస్యం చె ప్పారు.