Sourav Ganguly : మజీ క్రికెటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో రాజకీయాల్లోకి వెళ్తారు. లేదంటే కోచింగ్ బాధ్యతలు చేపడుతారు. అంతర్జాతీయంగా పలువురు మాజీలు చేస్తున్న పని ఇదే. పొలిటిక్స్‌లో చేరి మంత్రి లేదంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావాలేగానీ ఎవరైనా ‘సై’ అంటారు. అయితే.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మాత్రం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతున్నాడు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయనకు రాజకీయాల్లోకి వెళ్తారా?.. టీమిండియా కోచ్ అవుతారా? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు దాదా ఆసక్తికర సమాధానం చెప్పాడు.
వచ్చే ఏడాది బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Bengal Assembly Elections) వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌గా, బీసీసీఐ పూర్వ బాస్‌గా పాపులర్ అయిన దాదా రాజకీయాల్లోకి వస్తానడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే ప్రశ్నను ఇంటర్వ్యూలో అడగగా తనకు మాత్రం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదంటున్నాడీ మాజీ సారథి. మరి క్రికెట్ కోచ్ అవుతారా?.. మహిళల క్రికెట్ పురోగతికి కృషి చేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు అవునని బదులిచ్చాడు గంగూలీ. అవకాశం లభిస్తే కోచ్‌గా భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించాలని భావిస్తున్నానని తన మనసులోని మాట చెప్పాడీ వెటరన్ క్రికెటర్.
‘నేను ఆటకు వీడ్కోలు పలికి 25 ఏళ్లు కావొస్తోంది. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడినయ్యాను. భారత క్రికెట్‌కు మరింత సేవ చేయాలనుంది. ముఖ్యంగా నాకు ప్రస్తుతం 50 ఏళ్లు. నేనైతే కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, ఏం జరుగుతుందో చెప్పలేం కదా. రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు. నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు. ప్రతి ఏడాది నన్ను పొలిటిక్స్‌లో చేరమని అడుగుతుంటారు. ఎందుకో తెలియదు నా మనసు మాత్రం అటువైపు మళ్లడం లేదు. రాజకీయాలు మీరు అనుకున్నంత తేలికేమీ కాదు. ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నా సరే నేను అటుగా వెళ్లేది లేదు. సో. అందుకే రాజకీయాలను నాకు సంబంధం లేని విషయమని నేను అనుకుంటాను’ అని గంగూలీ తెలిపాడు.
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అనగానే లార్డ్స్ మైదానంలో చొక్కా విప్పేసి అతడు చేసిన విజయగర్జనే గుర్తుకు వస్తుంది. కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించిన దాదా.. సారథిగా టీమిండియాకు దూకుడు నేర్పాడు. రిటైర్మెంట్ తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడిగా.. ఆ అనంతరం బీసీసీఐ బాస్‌గా సేవలందించాడు గంగూలీ. అనంతరం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు రెండు దఫాలు టీమ్ డైరెక్టర్‌గా కొనసాగాడు.