హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆ దిశగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇంటిగ్రేషన్, పాలసీ అండ్ రెగ్యులేటరీ ఫెసిలిటేషన్, సస్టెయినబిలిటీ అండ్ గ్రీన్ లాజిస్టిక్స్, సిల్ డెవలెప్మెంట్ అండ్ ఇన్నోవేషన్‌తో కూడిన ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘మెస్సే ముంచెన్ ఇండియా (మెస్సే ముంచెన్ జర్మనీ అనుబంధ సంస్థ)’ నిర్వహిస్తున్న ‘ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ ఇండియా 2026’ సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలక రంగాల్లో ప్రధానమైన ‘లాజిస్టిక్ రంగం’లో 2047 నాటికి తెలంగాణను తిరుగులేని శక్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. భౌగోళిక విస్తీర్ణంలో 11, జనాభాలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ వాటా దేశ జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉందన్నారు. దీన్ని 2047నాటికి 10 శాతానికి పెంచాలనే సంకల్పంతోనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌కు శ్రీకారం చుట్టామన్ని తెలియజేశారు. ఇక 3 ట్రిలియన్ డాలర్లకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చేర్చాలనే లక్ష్య సాధనలో లాజిస్టిక్ రంగానిదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్-2, కొత్త ఎయిర్‌పోర్టులు, డ్రైపోర్టు, తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ 2.0, లాజిస్టిక్ హబ్స్ తదితర ప్రాజెక్టులు రాష్ర్టాన్ని అంతర్జాతీయస్థాయి కేంద్రంగా మార్చుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మల్టీ మోడల్, రైల్ లింక్డ్ అసెట్స్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్-ఏ వేర్‌హౌసింగ్, ఆటోమేషన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర కేటగిరీల్లో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శకమైన పాలసీలు, ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.