న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ గురువారం మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో సవరణలు చేసింది. ఈ క్రమంలోనే లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను పరిచయం చేసింది. అలాగే సొల్యూషన్ ఓరియెంటెడ్ స్కీముల కేటగిరీని తీసేసింది. మదుపరుల ప్రయోజనాల రక్షణార్థం మరికొన్ని నిర్ణయాలను కూడా తీసుకున్నది. పథకం పేర్లలో ఎక్కువ రాబడులను చూపించడం వంటి వాటిని నిరోధించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది.
కాగా, ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్ సైకిల్, ఇతరత్రా స్కీములు (ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీములు, ఇండెక్స్ ఫండ్స్ వంటి ప్యాసివ్ స్కీములు లేదా ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) అంటూ 5 కేటగిరీలను సెబీ తమ సర్క్యులర్‌లో ఈ సందర్భంగా పేర్కొన్నది. ఇక లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేవి ఓపెన్-ఎండెడ్ స్కీములు. ఇవి ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ వ్యవధులతో ఉంటాయి.
ఈక్విటీ, డెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్), ఎక్సేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటీవ్స్ (ఈటీసీడీలు), గోల్డ్/సిల్వర్ ఈటీఎఫ్‌లలో మదుపరుల లక్ష్యాలనుబట్టి వ్యూహాత్మక పెట్టుబడులకు అనువుగా ఉంటాయి. 5 ఏండ్ల నుంచి 30 ఏండ్లదాకా మెచ్యూరిటీలను ఎంచుకోవచ్చు. దీంతో మదుపరులకు లాభదాయకంగా మార్కెట్ నిపుణులు లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే సోషల్ మీడియా వేదికలపై పోస్టులు పెట్టేటప్పుడు తమ పరిధిలోని సంస్థలు, ఏజెంట్లు వారి రిజిస్ట్రేషన్ నెంబర్లనూ పెట్టాలని సెబీ ఆదేశించింది.
మోసపూరిత ప్రకటనలకు కళ్లెం వేసేందుకే ఇది అన్నది. కాగా, డెలివరీ, సెటిల్మెంట్ ఫ్రేమ్‌వర్క్, వ్యవసాయ కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో ప్రస్తుత రెగ్యులేటరీ నిబంధనల సమీక్షకు ఏర్పాటుచేసిన వర్కింగ్ గ్రూపులు సెబీ చైర్మన్‌కు తమ నివేదికల్ని సమర్పించాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్ పథకాల్లోని భౌతిక బంగారం, వెండి విలువల్ని లెక్కించే పద్ధతుల్ని సెబీ సవరించింది. స్టాక్ ఎక్సేంజీలు ప్రకటించే స్పాట్ ధరల్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నది. కాగా, తమ పేరుతో సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్‌ను చెల్లించాలంటూ వచ్చే డిమాండ్లను ఇన్వెస్టర్లు నమ్మవద్దని సెబీ సూచించింది.