IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆట మారలేదు. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో చెలరేగాల్సింది పోయి ప్రత్యర్థికి దాసోహం అయింది కమిన్స్ సేన. సిరాజ్(4-17) విజృంభణతో టాపార్డర్ కుప్పకూలగా.. నితీశ్ కుమార్ రెడ్డి (31), కెప్టెన్ కమిన్స్(27 నాటౌట్)లు పోరాడి గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. 153 పరుగుల ఛేదనలో 16కే 2 వికెట్లు పడినా శుభ్‌మన్ గిల్(61 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆల్రౌండరష్ వాషింగ్టన్ సుందర్(49) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయానికి బాటలు వేశాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్(35 నాటౌట్) లాంఛనం ముగించగా 7 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
ఐపీఎల్ 18వ సీజన్లో రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంత మైదానంలోనైనా గెలుస్తుందనుకున్న కమిన్స్ సేన.. పేలవ ప్రదర్శనతో గుజరాత్ దూకుడు ముందు తలవంచింది. 153 పరుగుల ఛేదనలో గుజరాత్ ఆదిలో తడబడినా.. నింపాదిగా ఆడుతూ విజయం సొంతం చేసుకుంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సన్‌రైజర్స్ బౌలర్లు పవర్ ప్లేలో అదరగొట్టారు. ఓపెనర్ సాయి సుదర్శన్(5)ను ఔట్ చేసిన షమీ తొలి వికెట్ అందించాడు. ఆ కాసేపటికే జోస్ బట్లర్(0) ను కమిన్స్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. అయితే.. 16 పరుగులకే 2 వికెట్లు పడిన వేళ.. వాషింగ్టన్ సుందర్(23) ధాటిగా ఆడాడు. సిమర్జిత్ సింగ్ వేసిన 6వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు.. నాలుగో, ఆరో బంతిని ఫైన్ లెగ్‌లో సిక్సర్‌గా మలిచాడు. దాంతో, గుజరాత్ 6 ఓవర్లకు 48 రన్స్ కొట్టింది.
From Shub, with love! 💙🙌 pic.twitter.com/hRdGvdOORB
— Gujarat Titans (@gujarat_titans) April 6, 2025
క్రీజులో పాతుకుపోయిన శుభ్‌మన్ గిల్(61 నాటౌట్), సుందర్ తాపీగా ఆడుతూ కీలక పరుగులు జోడించారు. ఓవర్‌కు ఒక బౌండరీ .. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును నడిపించారు. దాంతో, 13వ ఓవర్లో 100కు చేరువైంది గుజరాత్. అర్ధ సెంచరీకి చేరువైన సుందర్.. షమీ బౌలింగ్‌లో కొట్టిన బంతిని అనికేత్ వర్మ డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో అతడు పెవిలియన్ చేరాడు. దాంతో, మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(35 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ వేసిన 15వ ఓవర్లో ఆఫ్ సైడ్, లెగ్‌సైడ్.. హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. మరొక ఫోర్‌తో 18 పరుగులు పిండుకున్నాడీ హిట్టర్. అనంతరం జీషన్ బౌలింగ్‌లో గిల్.. రెండు ఫోర్లతో లక్ష్యాన్ని మరింత కరిగించాడు. కమిన్స్ వేసిన 17వ ఓవర్లో సిక్సర్, 4 కొట్టిన రూథర్‌ఫొర్డ్ జట్టుకు 7 వికెట్ల విజయాన్ని అందించాడు.
సొంతమైదానంలో రెచ్చిపోయి ఆడాతారని ఆశించిన అభిమానులను సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మళ్లీ నిరాశపరిచారు. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ నిలకడ లేమిని కొనసాగించింది టాపార్డర్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే గుజరాత్ టైటన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్(4-17) ఆరెంజ్ ఆర్మీకి పెద్ద షాకిచ్చాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(8), అభిషేక్ శర్మ(18)లను పెవిలియన్ పంపాడు.
𝐓𝐡𝐞 𝐒𝐈𝐔𝐔𝐔-𝐑𝐀𝐉 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 🫡
🔽 Click below to relive Mohd. Siraj’s sensational spell 🔥https://t.co/rRa2liYk3M #TATAIPL | #SRHvGT | @mdsirajofficial pic.twitter.com/TCuQ2aJJS2
— IndianPremierLeague (@IPL) April 6, 2025
50 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో నితీశ్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27)లు 50 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో అనికేత్ వర్మ(18), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(22 నాటౌట్) మెరుపులతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. వీళ్ల మెరుపులతో నిర్ణీత ఓవర్లలో ఆరెంజ్ ఆర్మీ 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేయగలిగింది.