Team India : పొట్టి ప్రపంచకప్ అనంతరం భారత జట్టు (Team India) మరో పొట్టి సిరీస్ ఆడనుంది. జూలైలో టీమిండియా జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటివరకూ ప్రధాన కోచ్ ఎవరో తేలకపోవడంతో వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆధ్వరంలో భారత్ ఈ సిరీస్‌కు బయల్దేరనుంది. ఇక కెప్టెన్ విషయానికొస్తే.. వరల్డ్ కప్ చాన్స్ కోల్పోయిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubamn Gill) సారథిగా ఎంపికయ్యే అవకాశాలున్నాయి.
అంతేకాదు ఐపీఎల్ 17వ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్ పరాగ్(Riyan Parag)ను జట్టులోకి తీసుకుంటారని సమాచారం. అదే జరిగితే.. పరాగ్ అరంగేట్రం కల నెరవేరినట్టే. జూలై 5 నుంచి భారత్, జింబాబ్బేల మధ్య ఐదు టీ20 సిరీస్ జరుగనుంది.
జింబాబ్వే పర్యటనకు పలువురు సీనియర్లను బీసీసీఐ పక్కన పెట్టనుంది. టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో పాటు సూర్యకుమార్ యాదవ్‌కు భారత బోర్డు విశ్రాంతి ఇవ్వనుంది. దాంతో, యువకులతో నిండిన జట్టును జింబాబ్వేకు పంపాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
వరల్డ్ కప్‌లో బెంచ్‌కే పరిమితమవుతున్న యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, రింకూ సింగ్‌లు ఈ పర్యటనలో భాగమయ్యే చాన్స్ ఉంది. ఐపీఎల్లో దంచికొట్టిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలు, సీఎస్కే యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే, కోల్‌కతా స్పీడ్‌స్టర్ హర్షిత్ రానాలు జింబాబ్వే విమానం ఎక్కే అవకాశముంది.