IND vs AUS : టీ20 వరల్డ్ కప్‌లో సైమీ ఫైనల్ రేసు ఆసక్తిగా మారిన వేళ భారత్ (Team India), ఆస్ట్రేలియా (Australia)లు కీలక పోరాటానికి సిద్ధమయ్యాయి. సెయింట్ లుసియా(St Lucia)లోని డారెన్ సమీ స్టేడియంలో ఇరుజట్లు ఆఖరి సూపర్ 8 మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. నిరుడు నవంబర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడించిన కంగారూలపై ప్రతీకారంతో రగిలిపోతున్న టీమిండియాకు ఎనిమిది నెలల తర్వాత సువర్ణావకాశం దొరికింది.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే.. మిచెల్ మార్ష్(Mitchell Marsh) సేన వరల్డ్ కప్ నుంచి ఇంటి దారి పడుతుంది. దాంతో, ఇంతకుమించిన రివెంజ్ ఉండదని మాజీ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే.. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉంది. భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఒకవేళ సెయింట్ లూయిస్‌లో వాన పడితే మ్యాచ్ రద్దయ్యే చాన్స్ ఉంది. అదే జరిగితే సూపర్ 8లో రెండు విజయాలతో జోరుమీదున్న భారత జట్టు దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లుతుంది. మ్యాచ్ రద్దయిందంటే.. జూన్ 25న అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై కంగారూ జట్టు సెమీస్ ఆశలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ రషీద్ ఖాన్ సేన గెలిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అలాకాకుండా కొన్ని ఓవర్ల ఆట సాధ్యమైతే మాత్రం రోహిత్ సేన కచ్చితంగా ఆసీస్‌ను చిత్తుగా ఓడించాలి. అప్పుడే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఉంటుంది.
#TeamIndia have arrived in St. Lucia! 🛬
Today they take on Australia in the their last Super 8 match 💪#T20WorldCup | #INDvAUS pic.twitter.com/mhwABUIEkD
— BCCI (@BCCI) June 24, 2024
టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఆసీస్.. అనూహ్యంగా అఫ్గనిస్థాన్ చేతిలో దారుణంగా ఓడింది. గుల్బదిన్ నయీబ్(4/20) విజృంభణతో 21 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. మళ్లీ విజయంతో సెమీస్ బెర్తు దక్కించుకోవాలని మిచెల్ మార్ష్ సేన పట్టుదలతో ఉంది. రాత్రి 8 గంటలకు సెయింట్ లూయిస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి.