తిరుమల : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ నారాయణన్( Narayanan) సోమవారం తిరుమల( Tirumala ) శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఎల్వీఎం(LVM)-3 నమూనాతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో ఇస్రో చైర్మన్‌ను ఆలయ అధికారులు అర్చకులు వేదాశ్వీరచనం, తీర్థ ప్రసాదాలు అందజేసి ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈనెల 24న ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్-2ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. ఈ సందర్భంగా చైర్మన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎల్వీఎం 3 రాకెట్ సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడానికి ఉద్దేశించిన భారీ మిషన్ అని, 4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్ఫోన్లకు అందించడం దీని ఉద్దేశమని చైర్మన్ వెల్లడించారు.
ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదవ మిషన్. ఇస్రోకు 101వ ప్రయోగం. 2025లో ఇస్రో చేపట్టిన అయిదోది కూడా. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ను ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా దీనిని భావిస్తోన్నారు. కక్ష్యలోకి వెళ్లిన తర్వాత ఇది తన 223 చదరపు మీటర్ల ఫేజ్డ్-అరే యాంటెన్నాను విస్తరిస్తుంది.
లో- ఆర్బిట్ లో అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటెన్నాగా రికార్డు సృష్టిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు, సముద్ర జలాలు, విమాన ప్రయాణాల్లో సాంప్రదాయ సెల్యులార్ నెట్‌వర్క్‌లు అందించలేని కవరేజ్ అంతరాలను ఇది పూరిస్తుందని వివరించారు .