ఖమ్మం రూరల్, డిసెంబర్ 22 : ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీలో మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డు యందు గల రామ్ లీలా ఫంక్షన్ హాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం రూరల్ తాసీల్దార్ రాంప్రసాద్ పర్యవేక్షించారు. ఆపద సమయంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టాల్సిన కార్యక్రమాలను డెమో రూపంలో చేసి చూపించారు. అందులో భాగంగా వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సేవలను బాధితులకు అందించారు. వరదలు, ఇతర ముప్పులు ఏర్పడినప్పుడు పునరావాస కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత బాధితులకు అందించే సహాయాలను ఆయా శాఖల సిబ్బంది చేసి చూపించారు. బాధితులను తీసుకువచ్చిన తర్వాత వారికి పడక ఏర్పాట్లు, త్రాగునీరు, భోజనం అందించే పద్ధతి, అవసరమైన వారికి వైద్య సదుపాయం, మందుల పంపిణీ తదితర కార్యక్రమాలను డెమో రూపంలో చేసి చూపించారు.

Khammam Rural : ఈఎంసీలో విపత్తు నిర్వహణపై మాక్ డ్రిల్.. కమిషనర్, తాసీల్దార్ పర్యవేక్షణ
అదేవిధంగా ఫైర్, ఇరిగేషన్, గజ యితగాళ్ల పాత్ర, వారు చేయాల్సిన కార్యక్రమాలను చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో బాధితులకు, సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు, సేవలు ఈఎంసీ అలాగే రెవెన్యూ సిబ్బంది అందించారు. ఈ సందర్భంగా కమిషనర్, తాసీల్దార్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకృతి వైపరీత్యాలు జరిగిన సమయంలో పునరావాస కేంద్రాలకు తరలింపు అనంతరం చేపట్టాల్సిన చర్యలపై డెమో రూపంలో చేసి చూపించడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. డెమో కార్యక్రమానికి హాజరైన మున్సిపాలిటీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీ రామకృష్ణ, ఏడీ ప్రభాకర్, మండల వైద్యారోగ్య శాఖ, ఆర్ అండ్ బి, ఫైర్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు ఆపదమిత్ర సభ్యులు, గజ యితగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Khammam Rural : ఈఎంసీలో విపత్తు నిర్వహణపై మాక్ డ్రిల్.. కమిషనర్, తాసీల్దార్ పర్యవేక్షణ