పాట్నా: పోలీస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. (exam paper leak) పరీక్షకు హాజరైన అతడు రహస్యంగా తెచ్చిన మొబైల్ ఫోన్లో ప్రశ్నాపత్రం ఫొటో తీశాడు. ఆ ఫొటో పంపే క్రమంలో అతడు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన బీహార్‌లో ఈ సంఘటన జరిగింది.
ఆ రాష్ట్రంలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, నిఘా విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం పోటీ పరీక్ష ఆదివారం జరిగింది. బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమిషన్ (బీపీపీఎస్సీ) నిర్వహించిన ఈ పరీక్ష కోసం పాట్నా కాలేజీ సెంటర్‌కు ఒక వ్యక్తి హాజరయ్యాడు. అక్కడ ముందుగా దాచిన మొబైల్ ఫోన్లో ప్రశ్నాపత్రం ఫొటో తీశాడు. దానిని ఇతరులకు పంపేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు.
మరోవైపు పోలీస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్వామి వివేకానంద్ కుమార్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ యాక్సెస్ నిరోధించేందుకు పరీక్షా కేంద్రంలో జామర్లు ఏర్పాటు చేయడంతో అతడి ప్రయత్నాలు ఫలించలేదని పోలీసులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.