BGT 2024-25 : పెర్త్ టెస్టుకు ముందే భారత క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) గాయపడగా.. కుడి మోచేతికి బౌన్సర్ తగిలి కేఎల్ రాహుల్ నొప్పితో విలవిలలాడాడు. తాజాగా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం వీళ్లను అనుసరించాడు.
భారత బృందంలోని మరో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ పడుతుండగా గిల్ బొటనవేలికి బంతి బలంగా తాకింది. దాంతో, అక్కడి ఎముక విరగడంతో మైదానం వీడాడు. అయితే.. అతడి గాయం తీవ్రత గురించి పూర్తి సమాచారం లేదు.
Shubman Gill hurt his left hand while fielding in the slips during the match simulation at the WACA – it’s not certain whether the injury could endanger his selection for the first Testhttps://t.co/QKknLqBbjI | #AUSvIND pic.twitter.com/gmTCrmbaqC
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024
‘అవును.. శుభ్‌మన్ గిల్ బొటన వేలికి గాయమైంది. పెర్త్ టెస్టు సన్నాహక మ్యాచ్లోక్యాచ్ పట్టబోతుండగా బంతి తగిలి అతడు బాధ పడ్డాడు. దాంతో, బీసీసీఐ వైద్య బృందం అతడికి వెంటనే స్కానింగ్ పరీక్షలు నిర్వహించింది. అందులో గిల్ బొటన వేలి ఎముక విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో గిల్ పెర్త్ టెస్టులో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి’ అని భారత బోర్డు వర్గాలు తెలిపాయి.
గత పర్యటనలో కంగారూ బౌలర్లను ఉతికేసిన గిల్ తొందరగా కోలుకోవాలని భారత బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక కోహ్లీ, రాహుల్ విషయానికొస్తే.. విరాట్ యథావిధిగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కానీ, మోచేతి గాయం ఇంకా తగ్గకపోవడంతో రాహుల్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండిపోయాడు. పెర్త్ టెస్టుకు ఇంకా ఆరు రోజులే ఉంది. ఆలోపు వీళ్లు పూర్తిగా ఫిట్‌గా ఉంటారని భారత కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడు.
స్వదేశంలో న్యూజిలాండ్ ఇచ్చిన షాక్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో వెనకబడిన భారత జట్టుకు ఆస్ట్రేలియా సిరీస్ చాలా కీలకం. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా 4-1 లేదా 4-0తో సిరీస్ గెలవాల్సిన పరిస్థితి. అలాగని సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి లేదు. నిరుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు చెక్ పెట్టిన కమిన్స్ సేన స్వదేశంలో చెలరేగి ఆడాలనే పట్టుదలతో ఉంది. మధ్య నవంబర్ 22వ తేదీన పెర్త్ వేదికగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. గత రెండు పర్యటనల్లో కంగారూలను చిత్తుగా ఓడించిన భారత జట్టు ఈసారి కూడా విజయభేరి మోగించాలనే కసితో ఉంది.