హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యేనారా రాంమూర్తి నాయుడు(Nara Rammurthynaidu) మృతి పట్ల మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) సంతాపం ప్రకటించారు. రాంమూర్తి నాయుడు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు.
1994 సంవత్సరంలో తాము ఇద్దరం ఒకే సారి ఎమ్మెల్యే గా గెలిచామని గుర్తు చేసుకున్నారు. రాంమూర్తి నాయుడుతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నదని పేర్కొన్నారు. ఆయన మృతి తో మంచి మిత్రుడిని కోల్పోయాను. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
రాంమూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు తన సోదరుడి మరణవార్త తెలియగానే పర్యటనను రద్దు చేసుకుని స్వగ్రామానికి బయలుదేరారు.
ఆదివారం ఉదయం స్వగ్రామం నారావారిపల్లెలోనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా నారా రామ్ముర్తి నాయుడు కుమారుడే సినిమా నటుడు నారా రోహిత్. నారా రోహిత్ ఇప్పటికే హీరోగా పలు సినిమాల్లో నటించాడు.