Team India : సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే నయా సారథిని నియమించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అయితే.. విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ ఆశిస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం కుర్రాళ్లకే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో భావి కెప్టెన్‌గా కితాబులు అందుకుంటున్న శుభ్‌మన్ గిల్ (Shumban Gill), పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పేర్లను పరిశీలించే అవకాశం ఉంది.
కానీ, బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా అతడు సుదీర్ఘ కాలం జట్టుకు నాయకుడిగా ఉండే అవకాశం తక్కువ. కాబట్టి యంగ్‌స్టర్ అయిన గిల్ మంచి ఎంపిక అని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఒకవేళ అతడికే పగ్గాలు అప్పగిస్తే.. డిప్యూటీగా రిషభ్ పంత్(Rishabh Pant)ను ఎంపిక చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
🗣️ “He’s cool. He’s sexy. He’s got a thousand different products that he’s promoting. And if the ultimate one is Test cricket then I’m happy with that!”@Phil_Wisden reacts to reports that Shubman Gill could be in line to take over as India’s Test captain 🇮🇳
🤝 @remitly pic.twitter.com/MVqzHTSBPe
— Wisden (@WisdenCricket) May 9, 2025
టెస్టులకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగానే అందరి దృష్టి బుమ్రాపైనే నిలిచింది. అనుభవజ్ఞుడైన ఈ యార్కర్ కింగ్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అందరూ అన్నారు. కానీ, ఫాస్ట్ బౌలర్ అయిన అతడు తరచూ గాయాలపాలయ్యే అవకాశముంది. ఇప్పటికే ఈ స్పీడ్‌స్టర్ వెన్నునొప్పితో కొన్ని రోజులు ఆటకు దూరమయ్యాడు. భవిష్యత్‌లోనూ బుమ్రా కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోతే ఆ ప్రభావం జట్టుపై పడుతుంది. సో.. అలాంటప్పుడు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేయడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. బుమ్రాను సారథిగా చేయనప్పుడు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అర్థ రహితమని కొందరి వాదన. దాంతో.. విదేశాల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అలరించిన పంత్.. ఉప సారథిగా ఉంటే బాగుంటుందని బీసీసీఐ వర్గాలు అనుకుంటున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా ఎదిగిన గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడమే ఉత్తమం. బుమ్రా, కోహ్లీ, కేఎల్ రాహుల్(KL Rahul)ల బదులు అతడికి పగ్గాలు అప్పగించడం ద్వారా జట్టులో యువరక్తం నిండుతుంది. గిల్ సారథ్యంలో టీమిండియా బలమైన శక్తిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. కోహ్లీని మళ్లీ కెప్టెన్ చేస్తే.. అతడు మహా అంటే రెండు మూడు ఏళ్లు టెస్టు క్రికెట్ ఆడొచ్చు. 33 ఏళ్లున్న రాహుల్ సుదీర్ఘ ఫార్మాట్లో కెప్టెన్‌గా ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమే. సీనియర్లు వైదొలిగాక.. మళ్లీ కొత్త సారథి వేట తప్పనిసరి.
అదేదో ఇప్పుడే గిల్‌ను నాయకుడిని చేస్తే అతడు ఆలోపు రాటుదేలుతాడు. ఇప్పటికే ఐపీఎల్ 18వ సీజన్లో అతడు గుజరాత్ టైటాన్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేరువచేశాడు. కెప్టెన్‌గా రాణిస్తూనే.. బ్యాటర్‌గా పరగుల వరద పారిస్తున్నాడు. సో.. ఇప్పుడు బీసీసీఐ పెద్దలతో పాటు అభిమానులు కూడా గిల్‌ను టెస్టు సారథిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకూ 32 టెస్టుల్లో 35.05 సగటుతో 1,893 పరుగులు సాధించాడీ యంగ్‌స్టర్. అందులో 5 సెంచరీలు, 7 అర్ధ శతకాలు ఉన్నాయి.