ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. (India Pakistan Ceasefire) భారత్, పాకిస్థాన్ దీనిని ధృవీకరించాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. పాకిస్థాన్, భారతదేశం తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. సార్వభౌమత్వాన్ని లేదా ప్రాదేశిక సమగ్రతకు రాజీ పడకుండా ప్రాంతీయ శాంతి, భద్రత కోసం పాకిస్థాన్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘పాకిస్థాన్, భారతదేశం తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడకుండా ఈ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం ఎల్లప్పుడూ కృషి చేసింది’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యల వల్ల గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే పాక్ మిలిటరీ సంప్రదింపుల కారణంగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. మరోవైపు కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్, పాకిస్థాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించారు.
Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity!
— Ishaq Dar (@MIshaqDar50) May 10, 2025