Archery World Cup : ప్రతిష్ఠాత్మక ఆర్చరీ వరల్డ్ కప్లో భారత ఆర్చర్ మధుర ధమన్గాంకర్ (Madhura Dhamangaonkar) చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్లో ఇప్పటికే రెండు పతకాలు గెలిచిన తను.. పసిడితో తన కలను సాకారం చేసుకుంది. మూడేళ్ల విరామం తర్వాత పోటీపడిన ఆమెకు విశ్వవేదికపై ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. శనివారం జరిగిన ఆర్చరీ వరల్డ్ స్టేజ్ 2 ఫైనల్లో మధుర గురి తప్పకుండా బాణాలు సంధించింది. అమెరికాకు చెందిన కార్సన్ క్రాహే (Carson Krahe)ను 139 -138 పాయింట్లతో ఓడించింది.
చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో ముంబైకి చెందిన మధుర అదరగొట్టింది. ప్రపంచ స్థాయి క్రీడాకారిణులతో పోటీపడుతూ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆమెరికా ఆర్చర్ కార్సన్ క్రాహేకు సవాల్ విసిరిన మధుర.. గురి చూసి లక్ష్యాన్ని చేరుకుంది. మూడో రౌండ్లో81-85తో వెనకబడినప్పటికీ ఒత్తిడికి లోనవ్వలేదు. వరుసగా రెండుసార్లు 10 పాయింట్లు సాధించి ప్రత్యర్థికి షాకిచ్చింది.
From newcomer to gold medallist. 🥇🙌
Madhura Dhamangaonkar makes her second World Cup appearance one to remember.#ArcheryWorldCup pic.twitter.com/mNEkOEzM4w— World Archery (@worldarchery) May 10, 2025
ఆఖరి రౌండ్లో 9 పాయింట్లతో కార్సన్ను వెనక్కి నెట్టి.. స్వర్ణ పతకం గెలుచుకుంది. తద్వారా విశ్వ వేదికపై తొలి బంగారు పతకంతో మురిసిపోయిందీ యువ ఆర్చర్. మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనకపోవడంతో 24 ఏళ్ల మధర అన్ సీడెడ్గా ఈ పోటీల్లో బరిలోకి దిగింది. ఈవెంట్లో మహిళల టీమ్ ఈవెంట్లో వెండి, కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో అభిషేక్ వర్మ(Abhishek Verma)తో కలిసి దేశానికి కాంస్యం అందించింది మధుర.