గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 20, 2020 , 00:11:45

ప్రిక్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌

 ప్రిక్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌

బార్సిలోనా: భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌.. బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నీలో శుభారంభం చేశారు. వారితో పాటు అజయ్‌ జయరామ్‌, సహా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎన్‌ సిక్కిరెడ్డి - ప్రణవ్‌ జెర్రీ చోప్రా తమ విభాగాల్లో తొలి రౌండ్‌ నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. పారుపల్లి కశ్యప్‌, హెచ్‌ ప్రణయ్‌ ఆదిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ సైనా 21-16, 21-14తేడాతో యోనీ లీ(జపాన్‌)పై 35నిమిషాల్లోనే అలవోక విజయం సాధించింది. ఒలింపిక్స్‌లో చోటు సాధించాలన్న లక్ష్యంతో సత్తాచాటాలని సైనా పట్టుదలగా ఉంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 23-21, 21-18తేడాతో భారత్‌కే చెందిన యువ ఆటగాడు శుభంకర్‌ డేపై గెలిచాడు. 


మరో మ్యాచ్‌లో 21-14, 21-12తేడాతో క్రిస్టో పొపోవ్‌(ఫ్రాన్స్‌)పై గెలిచిన భారత ఆటగాడు అజయ్‌ జయరామ్‌తోనే ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ గురువారం తలపడనున్నాడు. కాగా, భారత ఆటగాడు హెచ్‌ ప్రణయ్‌ 18-21, 15-21తో డారెన్‌ లీ(మలేషియా) చేతిలో ఓడాడు. పారుపల్లి కశ్యప్‌ 9-21, 21-18 12-14తో ఉన్న సమయంలో మూడో గేమ్‌లోనే గోర్‌ కోయిల్‌హో(బ్రెజిల్‌)తో మ్యాచ్‌లో గాయం కారణంగా వైదొలిగాడు. మిక్స్‌డబుల్స్‌లోనూ ఎన్‌.సిక్కిరెడ్డి - ప్రణవ్‌ జెర్రీ చోప్రా జోడీ 10-21, 21-16, 21-17తో మాథియాస్‌ క్రిస్టియాన్‌సెన్‌ - అలెగ్జాండ్రా బోజే(డెన్మార్క్‌) ద్వయంపై గెలిచి.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. 


logo