గురువారం 16 జూలై 2020
Sports - Jun 14, 2020 , 20:27:56

సుశాంత్‌ బ్యాటింగ్‌ చూసి సచినే అవాక్కయ్యాడు..!

సుశాంత్‌ బ్యాటింగ్‌ చూసి సచినే అవాక్కయ్యాడు..!

ముంబై: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ సినిమా నిర్మాణంలో  భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే పాత్ర ఎంతో ఉంది. సినిమా అద్భుతంగా తెరకెక్కడంలో తెరవెనుక కిరణ్‌  విలువైన సలహాలిచ్చారు. ఈ చిత్రానికి క్రికెట్‌ సలహాదారు కూడా కిరణే.   2016లో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రి సింగ్‌ ధోనీ తరహాలో బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ చేయడంలో ఆయనే సుశాంత్‌కు శిక్షణ ఇచ్చారు. ధోనీ  హెలికాప్టర్‌ షాట్‌, కవర్‌లో  షాట్‌ ఆడటం, గ్లోవ్స్‌ ఉపయోగించే విధానం తదితర క్రికెట్‌ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు మోరే..సుశాంత్‌తో చాలా నెలల పాటు కలిసి పనిచేశారు. 


సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంపై కిరణ్‌ ట్విటర్లో స్పందించారు.  'ఇది నాకు వ్యక్తిగతంగా దిగ్భ్రాంతి కలిగించే క్షణం. ఎంఎస్‌ ధోనీ పాత్ర కోసం సుశాంత్‌కు నేనే శిక్షణ ఇచ్చాను. ఈ షాక్‌ నుంచి ఎలా బయటపడాలో అర్థంకావట్లేదు. మంచి స్నేహితుడు త్వరగా వెళ్లిపోయాడని' ఆయన ట్వీట్‌ చేశారు. ధోనీ సినిమా కోసం సుశాంత్‌కు శిక్షణ ఇస్తున్న సమయంలో జరిగిన కొన్ని విషయాలను మోరే ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

సుశాంత్‌ సింగ్‌ బ్యాటింగ్‌ చేయడాన్ని చూసిన సచిన్‌ టెండూల్కర్‌ నివ్వెరపోయిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. సుశాంత్‌ ఎంఎస్‌ ధోనీ బయోపిక్‌ కోసం ట్రైన్‌ అవుతున్న రోజులవి.  డైరెక్టర్‌ నీరజ్‌ పాండే, నిర్మాత అరుణ్‌ పాండే కోరడంతో వికెట్‌కీపింగ్‌, బ్యాటింగ్‌లో అతనికి కోచింగ్‌ ఇచ్చాను. శిక్షణలో భాగంగా కొన్నివారాల తర్వాత ధోనీ ఫేమస్‌ హెలికాప్టర్‌ షాట్‌ను సుశాంత్‌ సాధన చేస్తున్నాడు. బీకేసీ బాంద్రాలోని ట్రైనింగ్‌ గ్రౌండ్‌లోకి అనుకోకుండా సచిన్‌ ఒకరోజు వచ్చారు. 

టెండూల్కర్‌ గ్యాలరీ నుంచి చూస్తున్నారు. ప్రాక్టీస్‌ తర్వాత సచిన్‌ను కలిశాను. ఆ కుర్రాడు ఎవరు? బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాడని సచిన్‌ నన్ను అడిగారు.   ఆతను సినీనటుడు సుశాంత్‌.. ధోనీ బయోపిక్‌ కోసం సన్నద్ధమవుతున్నాడని చెప్పాను. టెండూల్కర్‌ వెంటనే షాక్‌ అయ్యారు.  ''అతనికి ఆటపై ఆసక్తి ఉంటే ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడగల సత్తా అతనికి ఉందని, మంచివాడిలా కనిపిస్తున్నాడని'' సచిన్‌ ప్రశంసించారని మోరే పేర్కొన్నారు.  

తాజావార్తలు


logo