Team India : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఈ టోర్నీ ముగియగానే భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్నారు. టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య జూన్ 20 న తొలి టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇండియా ‘ఏ’ టీమ్‌ను ఇంగ్లండ్ పంపేందుకు బీసీసీఐ సిద్ధమైంది. జూనియర్లతో పాటు సీనియర్ జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు కూడా వెళ్లుతారని సమాచారం. ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆడడం ద్వారా వీళ్లు అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడతారు. అందుకే సీనియర్లును భారత ఏ జట్టుతో పంపాలని బీసీసీఐ భావిస్తోందట.
జూన్‌లో ఐదు టెస్టుల సిరీస్ కంటే ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో భారత ఏ జట్టు నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. తొలి మ్యాచ్ స్పిట్ఫైర్ మైదానంలో, రెండో మ్యాచ్ నార్తంప్టన్లోని కౌంటీ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఇండియా ఏ టీమ్‌కు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించే అవకాశముంది. శ్రేయస్ అయ్యర్, దేశవాళీలో సెంచరీలతో చెలరేగుతున్న కరుణ్ నాయర్లు స్క్వాడ్‌కు ఎంపికయ్యే వీలుంది. కుర్రాళ్లు, సీనియర్లతో కూడిన భారత ఏ జట్టుకు దిశానిర్దేశనం చేసేందుకు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా ఇంగ్లండ్ వెళ్తాడని టాక్. జూనియర్లతో పాటు ఇంగ్లండ్ విమానం ఎక్కే సీనియర్ ఆటగాళ్లు ఎవరు? అనేది త్వరలోనే తెలియనుంది.
🚨 INDIAN CRICKET UPDATE 🚨
India’s main players are likely to play in the A team against England Lions ahead of the five match Test series. 🇮🇳 [PTI] pic.twitter.com/yQPCjY9x0K
— Johns. (@CricCrazyJohns) March 25, 2025
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జూన్ 20న తొలి టెస్టు మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో జరుగనుంది. జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు.. లార్డ్స్ వేదికగా జూలై 10వ తేదీన మూడో మ్యాచ్ ఉంటాయి. జూలై 23న జరిగే నాలుగో టెస్టుకు మాంచెస్టర్‌లోని స్టేడియం, జూలై 31న మొదలయ్యే ఐదో టెస్టుకు కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదిక కానున్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. అందుకే.. ఇంగ్లండ్ సిరీస్‌ను రోహిత్ సేన ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.