సామాజిక న్యాయం అనే నినాదం దేశ రాజకీయాల్లో, ప్రతి ఎన్నికల్లోనూ అది ఓట్లను ఆకర్షించే రాజకీయ మంత్రంగా మారుతుంది. కానీ ఆ నినాదం ప్రజల జీవితాల్లో అనుభూతిగా మారుతుందా అనే ప్రశ్న మాత్రం మరింత కఠినంగా మన ముందుకు వస్తుంది. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటన ఒక గ్రామీణ ఘర్షణగా తేల్చేసుకునే స్థాయిలో లేదు.
తెలంగాణ సమాజపు నైతిక అంతరాత్మను ప్రశ్నించిన ఒక దారుణ ఘటన. ఒక పసికూనను కాళ్లతో తన్ని చంపిన కుల దురహంకారం కారణంగా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చ. అదే నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో చాకలి చిలికేశ్వరం చంద్రకళ కుటుంబంపై జరిగిన దాడి. కుల వివక్షతో దేవుడి దర్శనానికి అర్హులు కాదని దూషించడం, వంద రూపాయల కోసం కుటుంబాన్ని అవమానించడం, మహిళలను కిందకు తోసేయడం, చిన్న కుమారుడిని కొట్టడం, చివరకు పసికూన ప్రాణం పోవడం కుమ్మెరలో జరిగాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి మౌనానికి రాజకీయమే కారణమా? నైతిక వైఫల్యమా అనే ప్రశ్న ప్రజల మస్తిష్కాన్ని వెంటాడుతున్నది.
కులం ఒక సామాజిక సమస్య కాదు, అది ఒక రాజకీయ, ఆర్థిక నిర్మాణం. భూమి, వనరులు, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధిత్వం- ఈ అన్నింటినీ నియంత్రించే ఒక బలమైన వ్యవస్థ కులం. కొందరిపై తక్కువ కులమని ముద్రవేసి, ఆ వర్గం వారిని భయపెట్టి, వారిపై ఆధిపత్యం చెలాయించడం-ఇది కుల రాజకీయాల అసలైన స్వరూపం. కుమ్మెరలో జరిగిన ఘటన ఇందుకు ప్రత్యక్ష నిరూపణ.
కుల గౌరవం అనే భావన ఒక మానసిక నియంతృత్వం. అది ప్రేమను నేరంగా, సమానత్వాన్ని అపరాధంగా, మానవత్వాన్ని తిరుగుబాటుగా మార్చుతుంది. ఈ మానసిక నియంతృత్వం గ్రామాల్లో మాత్రమే కాదు, నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో, కార్యాలయాల్లో కూడా సూక్ష్మ రూపంలో కొనసాగుతున్నది. పోలీస్ వ్యవస్థ తరచుగా కుల ఆధిపత్యానికి రక్షణగా మారుతున్నది. గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల మౌనం అపరాధమే. ప్రజాప్రతినిధులు సమాజంలోని బలవంతులైన కుల సమూహాలను ఎదుర్కొనే ధైర్యం లేకపోతే పాలక వ్యవస్థ కులాధిపత్యానికి బానిసగా మారుతుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు కుల హింసలకు మౌన రక్షణగా మారాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు, కుమ్మెర ఘటనపై వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారి ద్వంద్వ నీతికి నిదర్శనంగా కనిపిస్తున్నది. ప్రజలు రాజకీయ నినాదాలపై కాదు, పాలనా ఆచరణపై తీర్పు ఇస్తారు. సామాజిక న్యాయం ప్రభుత్వ ప్రకటనల్లో కాకుండా పోలీసు స్టేషన్లు, కోర్టులు, గ్రామాల్లో అమలయ్యే విధానాలుగా మారాలి. మీడియా పాత్ర కూడా మేధోపరమైన విమర్శకు లోబడి ఉండాలి. మీడియా కుల హింసలను సంచలన వార్తలుగా చూపించి, దీర్ఘకాలిక సామాజిక చర్చను నిర్మించడంలో విఫలమవుతున్నది. కుల హింసలను వ్యక్తిగత ఘర్షణలుగా చూపించడం ఒక మేధోపరమైన నేరం. యువత పాత్ర ఈ సందర్భంలో కీలకం. కుల గోడలను యువత ప్రశ్నించాలి.
ప్రభుత్వం కుమ్మెర ఘటనను కేవలం ఒక సాధారణ నేర ఘటనగా చూడకూడదు. ఇది ఒక సామాజిక న్యాయ పరీక్ష. రాష్ట్ర స్థాయి ప్రత్యేక విచారణ కమిటీలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సాక్షుల రక్షణ పథకాలు, కుల హింసలపై ప్రత్యేక పోలీస్ సెల్- ఇవి ప్రజాస్వామ్యానికి అవసరమైన రక్షణ సాధనాలు. కానీ రాజకీయ సంకల్పం లేకపోతే ఇవి కాగితాలపై మిగిలిపోతాయి. కుమ్మెర ఘటన ఒక దుర్భరమైన సత్యాన్ని మన ఎదురుగా నిలబెట్టింది. చట్టాలు ఉన్నా, హక్కులు ఉన్నా, రాజ్యాంగం ఉన్నా, వాటిని సమాజం మనసులోకి తీసుకోవాలి.
సమానత్వం, సోదరభావం, మానవ గౌరవం అనేవి రాజ్యాంగ స్ఫూర్తిని చాటే పదాలు మాత్రమే కాకుండా, సామాజిక జీవన విధానంగా మారాలి. మనం మౌనంగా ఉంటే, దుర్మార్గపు వ్యవస్థలో భాగమవుతాం. తిరుగుబాటు అంటే రాళ్లు విసరడం కాదు, ఆలోచనల్లో విప్లవం, సంస్కృతిలో మార్పు, విద్యలో మానవత్వం నాటడం. సమాజం కుల గౌరవం నుంచి మానవ గౌరవం వైపు మారనంత వరకు అభివృద్ధి ఒక నినాదంగా మిగిలిపోతుంది.
తెలంగాణ సమాజం ఈ నైతిక పరీక్షలో ఉత్తీర్ణం కావాలి. ఒక పసికూన ప్రాణం మన చరిత్రలో శాశ్వత ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రభుత్వం శక్తిమంతుల రక్షణ కోసం కాదు, అశక్తుల గౌరవం కోసం పెద్దదిక్కుగా నిలువాలి. మనం మానవ గౌరవాన్ని ఎంచుకుంటే, తెలంగాణ నిజమైన ఆధునిక సమాజంగా మారుతుంది. కుల గౌరవానికే పట్టం కడితే, కుమ్మెరలో జరిగిన అమానవీయ ఘటన మన సమాజంపై చెరగని మచ్చగా నిలిచిపోతుంది. కులానికి విధేయులమవుతామా, మానవత్వానికి విధేయులమవుతామా అనే ప్రశ్న ఇప్పుడు మన సమాజపు భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ప్రశ్నగా మారింది.
-మన్నారం నాగరాజు