Rohit Sharma : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ముందున్న భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్(Bangladesh) సవాల్‌కు సిద్ధమవుతుంది. పాకిస్థాన్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయంతో జోరుమీదున్న బంగ్లాదేశ్‌కు చెక్ పెట్టేందుకు రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం కాచుకొని ఉంది. చెన్నైలో రేపు జరుగబోయే తొలి టెస్టుకు ముందు రోహిత్ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం క్రికెట్లో వీడ్కోలు(Retirement) పలకడం అనేది జోక్ అయిందని అన్నాడు. ఈకాలంలో చాలామంది ఆటకు గుడ్ బై చెప్పేసి.. యూటర్న్ తీసుకుంటున్నారని హిట్‌మ్యాన్ గుర్తు చేశాడు.
‘ఈమధ్య కాలంలో క్రికెట్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కొందరు ఆటకు వీడ్కోలు పలికిన కొన్ని రోజులకే ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నారు. అయితే.. మనదేశంలో మాత్రం ఇలా జరుగలేదు. కానీ, ఇతర దేశాల్లో మాత్రం ఈ యూటర్న్ సంప్రదాయం కొనసాగుతోంది’ అని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.
టీమిండియాను వరుసగా మూడు ఐసీసీ(ICC) ఫైనల్స్‌కు తీసుకెళ్లిన రోహిత్.. ఎట్టకేలకు జట్టును టీ20 విజేతగా నిలిపాడు. బార్బడోస్ గడ్డపై వరల్డ్ కప్ ట్రోఫీని సగర్వంగా అందుకున్న రోహిత్ ఆ వెంటనే పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ డాషింగ్ బ్యాటర్ వన్డే, టెస్టు సారథిగా మాత్రమే కొనసాగుతున్నాడు.
టీమిండియా 17 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసిన రోహిత్ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అరుదైన క్లబ్లో చేరనున్నాడు. సిక్సర్ల వీరుడిగా పేరొందిన రోహిత్ మరో ఎనిమిది సిక్సర్లు కొడితే వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag)ను దాటేస్తాడు. ప్రస్తుతానికి భారత కెప్టెన్ టెస్టుల్లో 84 సిక్సర్లు బాదేశాడు. మాజీ ఓపెనర్ వీరూ 104 టెస్టు మ్యాచుల్లో 91 సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో శివాలెత్తిపోయిన రోహిత్ అదే ఊపులో ఆడితే సెహ్వాగ్ రికార్డు బద్ధలవ్వడం ఖాయం.