సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీలో ఓ వ్యక్తి తన వంద గజాల ప్లాట్‌లో ఇల్లు కట్టుకునేందుకు రెండు రోజుల క్రితం రూ.12 వేలు పెట్టి ఇసుక తెప్పించాడు. కాగా రోడ్డు నంబర్ 8 వద్ద నాలాను మూసి వేయడంతో రాత్రికి రాత్రే నీళ్లు చేరి ఇసుక కొట్టుకపోయింది. అలాగే సోమయ్య అనే వ్యక్తి 200 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు డోజర్‌తో క్లీన్ చేయించాడు. రెండు రోజుల తరువాత ప్లాట్ వద్దకు వెళ్లి చూస్తే అవాక్కయ్యాడు. ప్లాట్ చుట్టూ నీళ్లు ఉండడంతో అసలు ఎక్కడి నుంచి వచ్చాయో అని ఆరా తీస్తే దిగువన నాలా మూసిసినట్లు తేలింది.
సూర్యాపేట, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్వాకంతో జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీ జలమయమవుతోంది. ఎగువ నుంచి దిగువకు వెళ్లే నాలాను మూసి వేయడంతో దాదాపు వంద ఇండ్ల చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. పొలాల నుంచి వచ్చే జాలుతో పాటు గండ్ల చెరువు నుంచి పారే నీళ్లు స్నేహనగర్, మానస నగర్ మీదుగా సద్దుల చెరువులోకి వెళుతుంటాయి. అయితే ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్నేహనగర్ రోడ్డు నంబర్ 8 వద్ద వరద నీరు దిగువకు వెళ్లకుండా అడ్డు కట్ట వేయడంతో రోడ్డు నంబర్ 6 నుంచి 13 వరకు వరద మయం అవుతోంది. ఎక్కడికక్కడ నీళ్లు చేరి నిల్వ ఉండటంతో దుర్గంధంతో పాటు దోమలు, క్రిమికీటకాలతో జనం సతమతమవుతున్నారు. వాస్తవానికి స్నేహనగర్కు ఎగువ నుంచి ఒక నాలా ఉండేదని, పట్టణం విస్తరిస్తున్న కొద్దీ రియల్ వ్యాపారులు వెంచర్లు చేస్తూ కాల్వలు, నాలాలు కబ్జా చేసి, వాటి అనవాళ్లు కూడా లేకుండా చేశారని స్థానికులు చెబుతున్నారు. అలాగే గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ నీరు పారుతున్నా ఇది నాలానా లేక ప్రైవేట్ భూములా అనే విషయం ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా ఇటీవల నాలా మూసి వేయడంతో వీధులు, ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
గత కొన్నేళ్లుగా అక్కడ నీరు ప్రవహిస్తున్నా అది నాలానా.. కాదో అనేది అధికారులకు తప్ప ఇతరులకు తెలియదు. అయితే ఇటీవల ఒక్కసారిగా నీళ్లు ఇళ్ల చుట్టూ చేరడంతో ఇప్పు డు పెద్ద చర్చ సాగుతున్నది. ఒకవేళ ప్రైవేట్ భూములైనా చెప్పకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇండ్లలోకి నీరు చేరతాయనే విషయం తెలిసినా అడ్డు కట్ట వేయకపోవడంతో స్థానికుల్లో రియల్టర్లపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గతంలో కూడా సూర్యాపేటలోని జాహ్నవి, జీఎంఆర్ వెంచర్లు వేయక మునుపు సదరు భూమిలో నుంచి వరద పారేది. అయితే డీటీసీపీ లేఅవుట్ పర్మిషన్ తెచ్చుకున్న రియల్టర్లు, బిల్డర్లు నాటి అధికారుల ఆదేశాలతో పైపులైన్లు వేసి నీటిని బైపాస్ చేయడంతో ఇప్పటికీ ఎలాంటి సమస్య తలెత్త లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయం చూపి తమకు జలగండం నుంచి తప్పించాలని స్థానికులు కోరుతున్నా రు. ప్రస్తుతం తమ ఇండ్ల చుట్టూ నీరు చేరిందని ఒకవేళ వర్షం వస్తే పెను ప్రమాదమే సంభవిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్నేహనగర్ కాలనీ వాసులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే నీరు చేరుతున్న ప్రాంతాల్లో పర్యటించి మున్సిపల్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లా. ప్రత్యామ్నాయం చూపించాలని కాలనీ వాసులను తీసుకెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించగా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.