Dean Elgar : దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్(Dean Elgar) ఓటమితో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై కేప్‌టౌన్(Kape Town)లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎల్గర్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా(South Africa) చిత్తుగా ఓడిపోయింది. దాంతో, సగర్వంగా కెరీర్‌ను ముగించాలనుకున్న అతడి కల ఫలించలేదు. అయితే.. ఆఖరి మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కడం ఎల్గర్‌కు పెద్ద ఊరట. కేప్‌టౌన్ టెస్టులో విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సఫారీ సారథికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.
కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసిన ఎల్గర్‌కు.. భారత జట్టు సభ్యులు సంతకాలు చేసిన జెర్సీని హిట్‌మ్యాన్ కానుకగా ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ.. ఎల్గర్ తదుపరి జీవితానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అంతేకాదు సంతకం చేసిన జెర్సీని జ్ఞాపకంగా అందించాడు. సెంచూరియన్(Centurion) టెస్టులో ఎల్గర్ శతకంతో చెలరేగాడు. 180 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం ఎల్గర్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (5, 12రన్స్)తో నిరాశపరిచాడు. కేప్‌టౌన్‌లో జరిగిన సిరీస్ డిసైడర్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. మర్క్రమ్(106 : 103 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో భయపెట్టినా.. బుమ్రా విజృంభణతో భారత్ పైచేయి సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్ల నష్టానికి ఛేదించింది.