Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దేశం మొత్తాన్ని సంబురాల్లో ముంచెత్తాడు. 13 ఏండ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని ఒడిసి పట్టేసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. బార్బడోస్ గడ్డపై చిరస్మరణీయ విజయంతో యావత్ భారతం గర్వపడేలా చేసిన హిట్‌మ్యాన్ తాజాగా తన ‘ఎక్స్’ ఖాతా డీపీ మార్చాడు.
కెన్నింగ్టన్ ఓవల్‌లో జాతీయ జెండాను పాతుతున్న ఫొటోను డీపీగా పెట్టాడు. తన కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీ గెలిచిన సందర్భాన్ని రోహిత్ ఇలా జీవితకాల జ్ఞాపకంగా మలుచుకున్నాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్.. ఎట్టకేలకు భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీని కట్టబెట్టాడు.
నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌లో చేతికందాల్సిన కప్‌ను ఆస్ట్రేలియా తన్నుకుపోడంతో అతడి కల చెదిరింది. మరోవైపు వయసు నలభైకి చేరువ అవుతోంది. అందుకని ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఫిక్స్ అయిన హిట్‌మ్యాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)తో కలిసి జట్టు మొత్తాన్ని అందుకు తగ్గట్టే సిద్దం చేశాడు. వీళ్లిద్దరి దిశా నిర్దేశనంలో టీమిండియా ఒక్కో జట్టును మట్టికరిపించింది.
బలమైన ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టారు. దాంతో, అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ .. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాను 7 పరుగులతో ఓడించి రెండోసారి టీ20 చాంపియన్‌గా అవతరించింది.
#NewProfilePic pic.twitter.com/aDJFxW8783
— Rohit Sharma (@ImRo45) July 8, 2024
హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఓవర్ పూర్తికాగానే భావోద్వేగానికి లోనైన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత తమ గెలుపు సంతకానికి ప్రతీకా జాతీయ జెండాను మైదానంలో పాతాడు. ఇప్పుడు అదే ఫొటోను తన ఎక్స్ డీపీగా పెట్టుకొని తాను మురిసిపోవడమే కాకుండా దేశం మొత్తాన్ని మురిపించాడు.