Mandhana – Palash : భారత మహిళా క్రికెట్లో స్మృతి మంధాన(Smriti Mandhana) పేరు ఓ సంచలనం. చిన్నప్పుడు సోదరుడిని చూసి బ్యాట్ పట్టిన ఆమె ఇప్పుడు వరుస శతకాలతో ప్రపంచ క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓపెనర్‌గా టీమిండియా విజయాల్లో కీలకమవుతున్న మంధాన తాజాగా ప్రేమికుడితో కలిసి కేకు కట్ చేసింది. బాయ్‌ఫ్రెండ్‌తో ఐదేండ్ల ‘లవ్ జర్నీ’ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు మంధాన మనసు గెలిచిన మనోహరుడు ఎవరో తెలుసా..? పలాశ్ ముచ్చల్ (Palash Muchhal).
బాలీవుడ్ పాపులర్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడైన పలాశ్ ఒక మ్యూజిక్ కంపోజర్. పలాశ్.. మంధనాలు 2019లో ప్రేమలో పడ్డారు. ఈ ఏడాదికి వాళ్ల వలపు ప్రయాణానికి ఐదేండ్లు. దాంతో, ఇప్పటివరకూ రహస్యంగా ఉంచిన తమ ప్రేమ ప్రయాణాన్ని ఇద్దరూ జూలై 8వ తేదీన కేకు కటింగ్‌తో బహిర్గతం చేశారు. ఇంకేముంది.. ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ‘కాబోయే జంటకు అభినందనలు’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
భారత ఓపెనర్‌గా మంధాన ఆటకు ఫిదా అవ్వని వాళ్లు ఉండరు. మరోవైపు పలాశ్ సైతం కచేరీలు, సొంతంగా ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. అయితే.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పలాశ్, మంధానల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి తరచూ వీళ్లు పార్టీల్లో కలుస్తుండేవాళ్లు. అలా ఒకరిమీద ఒకరికి ప్రేమ పుట్టింది. అలాగని తమ రిలేషన్‌షిప్‌ను ఇద్దరూ ఎక్కడా బయటపడనివ్వలేదు.
ఈ జంట 2013లో తొలిసారి దీపావళి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి. అయినా సరే మంధాన, పలశ్లు ఓపెన్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా ఇద్దరూ జంటగా కెమెరా కంట పడ్డారు. ఈమధ్యే తన ప్రేయసికి పలాశ్ పియానో గురువుగా మారాడు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది.
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ (WPL 2024)లో మంధాన సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కప్పు కొట్టింది. అనంతరం జరిగిన సెలబ్రేషన్స్‌లో మంధానను పలాశ్ అభినందిస్తూ హత్తుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో మంధాన పరుగుల వరద పారిస్తోంది. వరుసగా రెండు వన్డేల్లో శతక గర్జన చేసిన ఆమె.. ఏకైక టెస్టులోనూ సెంచరీ కొట్టేసింది. ఓపెనర్ షఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించింది.