Paris Olympics : ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు ఇంకా 18 రోజులే ఉంది. ఈ మెగా టోర్నీలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు భారత బాక్సర్లు సిద్ధమవుతున్నారు. విశ్వ క్రీడల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా పోరాడతామని ఆశాభావంతో ఉన్నారు. తాజాగా జియో సినిమా ‘ది డ్రీమర్స్’ కార్యక్రమంలో యువ బాక్సర్ లొవ్లినా బొర్గొహెన్ (Lovlina Borgohain) సైతం ఇదే మాట చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లొవ్లినా ఈసారి కచ్చితంగా పసిడి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.
నాకు చిన్నతనంలో బాక్సింగ్ గురించి ఎక్కువ తెలియదు. మానాన్న టీ తోటల్లో పనిచేసేవారు. ఆయన ఒకరోజు కాగితం చుట్టిన డబ్బాలో స్వీట్లు తెచ్చారు. ఆ పేపర్లో మహ్మద్ అలీ స్టోరీ ఉంది. ఆ క్షణమే నాలో బాక్సర్ అవ్వాలనే కోరిక పుట్టింది. మొదట్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఆ తర్వాత నేరుగా నేషనల్ బాక్సింగ్‌లో పోటీ పడ్డాను అని లొవ్లీనా వెల్లడించింది. అంతేకాదు 69 కిలోల నుంచి 75 కిలోల కేటగిరీకి మారడంపై కూడా ఆమె స్పందించింది.
‘నేను కాంస్య పతకం ఈజీగా గెలిచేదాన్ని. అయితే.. 69 నుంచి 75 కిలోలకు మారాక నా ఆటలో చాలా మార్పు వచ్చింది. మొదట్లో బరువు పెరిగేందుకు కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, ఆ తర్వాత వరుసగా నాలుగు మెడల్స్ సాధించా. నేషనల్ గేమ్స్, నేషనల్ చాంపియన్‌షిప్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా చాంపియన్‌షిప్స్.. అన్నింటిలో నా పంచ్ పవర్‌తో పతకం గెలిచాను. ఈ విజయాలే నాకు ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొడుతాననే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి’ అని లొవ్లీనా వెల్లడించింది.