హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): చెయ్యి మార్పిడి శస్త్రచికిత్సల నిర్వహణకు రాష్ట్రంలో 4 దవాఖానలకు అనుమతులు ఇచ్చినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ (టీహెచ్వోటీఏ) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంగళవారం ఆయన ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో ఉన్నతస్థాయి సమీక్షలో రాజనర్సింహ మాట్లాడుతూ.. రా ష్ట్రంలో అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చే రోగుల కోసం విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రైవేట్ దవాఖానల్లో అవయవ మార్పిడి చికిత్సల ధరలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు.