Rohit Sharma : టీమిండియా కెప్టెన్‌గా పొట్టి ప్రపంచ కప్ కలను సాకారం చేసుకున్న రోహిత్ శర్మ(Rohit Sharma) ఫ్యామిలీ టైమ్ గడుపుతున్నాడు. లండన్‌లో వింబుల్డన్ (Wimbledon) సెమీస్‌ను వీక్షించిన రోహిత్ ఆ తర్వాత అమెరికా చక్కేశాడు. అక్కడ భారత సారథి ఎక్కడ కనిపించినా వరల్డ్ కప్ విజయం గురించే ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. దాంతో, హిట్‌మ్యాన్ మెగా టోర్నీ ఫైనల్‌పై కొన్ని వాస్తవాలు చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆఖరి ఐదు ఓవర్లు తాను బ్లాంక్ అయ్యానని అన్నాడు.
‘నేను నిజం చెప్తున్నా. ఆ ఐదు ఓవర్లు నేను బ్లాంక్ అయ్యాను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అని నేను ఆలోచించలేదు. అయితే.. ఆ క్షణంలో దృష్టి మరల్చకుండా ఉండడం నాకు ఎంతో ముఖ్యం. ప్రశాంతంగా ఉండి, మా ప్రణాళికలను అమలు చేయడం జట్టు మొత్తానికి చాలా ప్రధానం.

దక్షిణాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసమైనప్పుడు మేము ఎంతో ఒత్తిడిలో పడ్డాం. కానీ, మా బౌలర్లు ఆఖరి ఐదు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఏమాత్రం భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పని ముగిచారు’ అని రోహిత్ తెలిపాడు.
పొట్టి ప్రపంచ కప్‌లో రోహిత్ కెప్టెన్‌గా నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. జట్టును ముందుండి నడిపిస్తూ సారథిగా తనకు కావాల్సింది సాధించాడు. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాపై 92 పరుగులతో హిట్‌మ్యాన్ విధ్వంస రచన చేశాడు. ఆపై సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

సఫారీలతో జరిగిన ఫైనల్లో రోహిత్ నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (76) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాను 7 పరుగులతో ఓడించిన రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ అందుకుంది. హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఓవర్ పూర్తికాగానే భావోద్వేగానికి లోనైన హిట్‌మ్యాన్.. ఆ తర్వాత తమ గెలుపు సంతకానికి ప్రతీకా జాతీయ జెండాను మైదానంలో పాతాడు. అంతేకాదు అదే ఫొటోను తన ఎక్స్ డీపీగా పెట్టుకొని తాను మురిసిపోవడమే కాకుండా దేశం మొత్తాన్ని మురిపించాడు.